ప్రహేళిక:
కం.చీమల కాళ్ళు లావగు
సామజముల కాళ్ళు మిగుల సన్నంబగుగా !
భామల కాళ్ళు లోకువ
భూమీశా ! జనుల కాళ్ళు భోజన మౌగా !
పైకి కంపించే అర్థం:
చీమల కాళ్ళు లావుగా ఉంటాయంట! ఏనుగుల కాళ్ళు చాలా సన్నగా ఉంటాయంట ! భామల కాళ్ళు లోకువంట ! ( ఎవరికో ? ఎందుకో?) ఓ రాజా ! జనుల కాళ్ళే భోజన మౌతుందిగా ! ( ఇదేమిటో?)
ఓ రాజాస్థానానికి వచ్చిన కవి ఈ చమత్కార పద్యం చెప్పాడు. విన్న వారందరూ తికమక పడ్డారు. ఏమీ బోధ పడలేదు. చివరికి ఆ ఆస్థాన ప్రథాన కవి పండితుడు ఈ విధంగా విడమర్చి చెప్పాడు. రాజు సంతసించి ఇద్దరినీ సత్కరించాడు.
కవి భావన ఇది :
చీమలకు " ఆళ్ళు " చాలా పెద్ద గింజలౌతాయి కదా !అవే ఏనుగుల కైతే వాటి భారీ నోటికి పంటి క్రిందకు కూడా రావు. ఏనుగులకు " ఆళ్ళు" మిగుల సన్నం కాబట్టి. ఇక ఆడువారికి "ఆళ్ళు" దంచి పిండి కొట్టటం చాలా సులువైన పని కా బట్టి భామలకు " ఆళ్ళు" లోకువ.ఇక జనులకు " ఆళ్ళే" ప్రథానాహారం కదా నాడు !.
ఆధారం : గరికిపాటి నరసింహా రావు గారు టీవీ వన్ చానల్ లో నిర్వహిస్తున్న "సాహిత్యంలో హాస్యం " కార్యక్రమం నుండి (271 వ భాగం)
(ఆళ్ళ ధాన్యాన్ని ఆరికలని కూడా అంటారు.)