కృష్ణాష్టమిపర్వంబున
వృష్ణిని బూజించి పాలు వెన్నలతోడన్
కృష్ణునికి నివేదవలిడి
కృష్ణా ! మము గావుమనుచు కృపగోరవలెన్!!!
శ్రీ యదునందన శ్రీకర కృష్ణా!
మాయలు జూపెడు మాధవ కృష్ణా!
శ్రేయము గూర్చెడు చిన్మయకృష్ణా!
బాయక నుండుము బాగ్యద కృష్ణా!
నందుని యింటను నర్తిలు కృష్ణా!
విందగు నీకృప వీక్షణ కృష్ణా!
సుందర వందిత శోభిత కృష్ణా!
వందనమో హరి చందన కృష్ణా!
వెన్నుని బుట్టినరోజున
సన్నుతి జేయుచును తులసి సన్నిధి యందున్
చెన్నుగసాయంకాలము
మిన్నగ బూజించ వలెను మేదిని యందున్!!!
ఊయల లూగుము కృష్ణా
హాయిగ బృందావనమున నాడుచు మురళిన్
మ్రోయించుము నలవోకగ
తీయని గానమ్ము వినగ దెలియవు వెతలే!!!*****
బావుంది
ReplyDelete