Wednesday, August 31, 2016

శంకరాభరణం..2015 సమస్యాపూరణలు..

                                      శంకరాభరణం బ్లాగులో 
                                       2015 లో
                        శ్రీ కందిశంకరయ్య గురువుగారు ఇచ్చిన                                                             సమస్యలకు నాపూరణలు.
గురువుగారికి కృతజ్ఞతలతో...

కొత్తసంవత్సరము దెచ్చె కోటి వెతలు..(1)

శ్రీకరమ్ముగ వచ్చెను సిరులు గురియ
కొత్త సంవత్సరము, దెచ్చె కోటి వెతలు
సుందరనగరము విశాఖ సొగసు గూల్చి
మూడు జిల్లాల జనులకు ముప్పు తెచ్చి
పాత వత్సర మెంతయో కోత బెట్టె !!!

.కొత్తసంవత్సరమున ముక్కోటి వెతలు..(2)

ఏడు కొండల రాయుని వేడుకొనగ
కీడు పీడలు రాకుండ చూడు నతడె
కొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు

దీర్చి సకల సౌఖ్యములిడు ధిషణి యందు!!!

మద్యపాన రతుడుమాన్యుడగును.........(3)

చిత్తు గాను త్రాగి మత్తులోన మునుగు
మద్యపాన రతుడు, మాన్యుడగును
చెత్త మందు వీడి చిత్తమందున భక్తి
విత్తు నాట బొందు విమల యశము!!!

పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్!!!..(4)

మితిమీరిన చేతలతో
వెతలను బెట్టెడు మహిషుని పేరడగించన్
మతిహీనుండగు దానవ
పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్!!!......

దీనుల బ్రోచువారలను దిట్టిన గొట్టిన బుణ్యమబ్బురా ..(5)

మానవ సేవజేసినను మాధవసేవని మాన్యులందురే !
దానము జేయువారినిల దండన జేయుట ధర్మమవ్వదే ?
దీనుల బ్రోచువారలను దిట్టిన గొట్టిన బుణ్యమబ్బురా ?
పూనికతోడ జేయు సెస పోడిమి నిచ్చును మానవాళికిన్ !!!

తెలవాఱగ తూర్పు దెసను దిమిరము గ్రమ్మెన్ !!!.........(6)


కలనము వేళల విధిగా
నెలమేపరి బట్టుగాదె నేర్పుగ పాథిన్
తిలకించగ వసుధ నపుడు
తెలవాఱగ తూర్పు దెసను దిమిరము గ్రమ్మెన్ !!!

నలినములు విచ్చె కొలనున
తెలవాఱగ తూర్పు దెసను , దిమిరము గ్రమ్మెన్
నల పశ్చిమ దేశములన్
కలువలు కుసుమించు నపుడు కాసారమునన్ !!!

రామ - భరత - లక్ష్మణ - శత్రుఘ్న
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి....(7)
దత్తపది...

రావె గావగ లోకాభి రామ కృష్ణ!
భరత వంశపు ఖ్యాతియే భ్రష్టు పట్టె
పాండు సుతులు శత్రుఘ్నులై బండబాఱె
మాన రక్షక లక్ష్మణా మహిమ జూపు!!!

రామ! పాంచాలి జూడుమ రాజు సుతుని !!!...(8)

స్వయంవరములో ద్రౌపదితో కృష్ణుడు..

భరత వంశపు వీరుడు పార్ధుడతడె
సకల లక్ష్మణములుగల సవ్యసాచి
పవర మందున శత్రుఘ్న బలుడితండు
రామ! పాంచాలి జూడుమ రాజు సుతుని !!!


సిధ్ధు డైన వాడు బుద్ధి చెఱచు !!!......(9)

బుధ్ధి బలము పెంచి ముక్తి మార్గము జూపు
సిధ్ధు డైన వాడు, బుధ్ధి చెరచు
మూఢ భోధ జేసి ముప్పున బడవేయు
చదువు లేని వాడు సాధువైన

చిత్త శుద్ధి లేక శ్రీరంగనీతులు
చెప్ప నేమి ఫలము గొప్ప గాను
శుధ్ధి లేని మనసు సిధ్దిని బొందునా ?
సిధ్ధు డైన వాడు బుద్ధి చెఱచు !!!



(10)అంశం- ...కైక వరములు.
నిషిద్ధాక్షరము - ....
ఛందస్సు - తేటగీతి...


ధశరధుని మూడవసతియె దయను మాలి
పంపుమయ్య రాముని వనవాస మిపుడు
జీవనుడు భరతుని రాజు జేయమనుచు
వరముల నడిగెను పతిని వరుస గాను !!!














Saturday, August 27, 2016

ప్రహేళిక

ప్రహేళిక:


కం.చీమల కాళ్ళు లావగు

సామజముల కాళ్ళు మిగుల సన్నంబగుగా !

భామల కాళ్ళు లోకువ

భూమీశా ! జనుల కాళ్ళు భోజన మౌగా !


పైకి కంపించే అర్థం:

చీమల కాళ్ళు లావుగా ఉంటాయంట! ఏనుగుల కాళ్ళు చాలా సన్నగా ఉంటాయంట ! భామల కాళ్ళు లోకువంట ! ( ఎవరికో ? ఎందుకో?) ఓ రాజా ! జనుల కాళ్ళే భోజన మౌతుందిగా ! ( ఇదేమిటో?)
ఓ రాజాస్థానానికి వచ్చిన కవి ఈ చమత్కార పద్యం చెప్పాడు. విన్న వారందరూ తికమక పడ్డారు. ఏమీ బోధ పడలేదు. చివరికి ఆ ఆస్థాన ప్రథాన కవి పండితుడు ఈ విధంగా విడమర్చి చెప్పాడు. రాజు సంతసించి ఇద్దరినీ సత్కరించాడు.
కవి భావన ఇది :
చీమలకు " ఆళ్ళు " చాలా పెద్ద గింజలౌతాయి కదా !అవే ఏనుగుల కైతే వాటి భారీ నోటికి పంటి క్రిందకు కూడా రావు. ఏనుగులకు " ఆళ్ళు" మిగుల సన్నం కాబట్టి. ఇక ఆడువారికి "ఆళ్ళు" దంచి పిండి కొట్టటం చాలా సులువైన పని కా బట్టి భామలకు " ఆళ్ళు" లోకువ.ఇక జనులకు " ఆళ్ళే" ప్రథానాహారం కదా నాడు !.
ఆధారం : గరికిపాటి నరసింహా రావు గారు టీవీ వన్ చానల్ లో నిర్వహిస్తున్న "సాహిత్యంలో హాస్యం " కార్యక్రమం నుండి (271 వ భాగం)
(ఆళ్ళ ధాన్యాన్ని ఆరికలని కూడా అంటారు.
)
ప్రత్యుత్తరం

ప్రహేళిక- 50


ప్రహేళిక- 50


ఇతని పేరేమిటి?


సీ. ఖాండవమ్మను పేరు గలిగినట్టి దదేది?
వెలుఁగు నిచ్చెడునట్టి వేల్పెవండు?
జలమందు ముదమున జన్మించు పువ్వేది?
ఉచ్చైశ్శ్రవాఖ్యమై యొప్పు నేది?
స్తంభమున జనించి దనుజుఁ జంపె నెవండు?
దట్టమౌ వని కే పదంబు గలదు?
వనిలోన సీతఁ బట్టిన రాక్షసుఁ డెవండు? *
శిబి దేనికొఱకు నిచ్చెఁ దన పలలము?
తే. గీ.
అన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లందు రెండవ యక్షరా లరసి చూడ
దేశరాజకీయములలోఁ దేజరిలిన
తెలుఁడువాఁడి నామమ్మగుఁ దెలుపఁగలరె?
*(రావణుఁడు కాదు)



విపినము
వితుడు

జము

తుగము 

నృసింహుడు

  గనము 

విరాధుడు 

పావురము


పద్యరూపంలో నా సమాధానం...



బహుముఖ ప్రజ్ఞాశాలియు

బహుభాషల కోవిదుండు భరతావనిలో

సహృదయుడు గ్పంథివరుడౌ

రహి శ్రీ పీవినరసింహ రావగు నార్యా!!!









ప్రహేళిక ..51

     
ప్రహేళిక-51

                                       నామగోపన పద్యం

తే.గీ.
"కంజదళనేత్ర! మాధవ! కంసభేది!
శంఖచక్రగదాధర! సాధులోక
రక్షకా! చేతు నీదు ప్రార్థనము లయ్య!"
యనిన గుప్తనామం బేదొ యరయుఁ డిపుడు. 


పై పద్యంలో దాగిన పేరేదో చెప్పండి.

నాసమాధానం ....(గురువుగారి పేరు)...

అన్ని పాదములందున నంత్య ప్రధమ
నక్షరములను గలుపగ లక్షణముగ
వచ్చు నామమ్ము జనులార ఖచ్చితముగ
సందియమ్మేల నది 'కంది శంకరయ్య'!!!

Thursday, August 25, 2016

కృష్ణాష్టమి ..




కృష్ణాష్టమిపర్వంబున
వృష్ణిని బూజించి పాలు వెన్నలతోడన్
కృష్ణునికి నివేదవలిడి
కృష్ణా ! మము గావుమనుచు కృపగోరవలెన్!!!

శ్రీ యదునందన శ్రీకర కృష్ణా!
మాయలు జూపెడు మాధవ కృష్ణా!
శ్రేయము గూర్చెడు చిన్మయకృష్ణా!
బాయక నుండుము బాగ్యద కృష్ణా!

నందుని యింటను నర్తిలు కృష్ణా!
విందగు నీకృప వీక్షణ కృష్ణా!
సుందర వందిత శోభిత కృష్ణా!
వందనమో హరి చందన కృష్ణా!

వెన్నుని బుట్టినరోజున
సన్నుతి జేయుచును తులసి సన్నిధి యందున్
చెన్నుగసాయంకాలము
మిన్నగ బూజించ వలెను మేదిని యందున్!!!

ఊయల లూగుము కృష్ణా
హాయిగ బృందావనమున నాడుచు మురళిన్
మ్రోయించుము నలవోకగ
తీయని గానమ్ము వినగ దెలియవు వెతలే!!!*****

Tuesday, August 23, 2016

పద్యమాలిక జూన్-1


జ్యోతి వలభోజుగారు నిర్వహించు ఇ మేగ్జైన్ మాలిక లో ఇచ్చిన చిత్రమునకు  ప్రచురింపబడిన నా పద్యములు...


కందం —1

తాపము బెట్టెడి భానుడు
పాపము తన వేడికి తనె వడగొనె నేమో!
సూపరుగా స్ట్రా వేసుకు
రూపరి బుంగన జలమును రొప్పుచు ద్రాగెన్!!!

కందం —2

కుండను తలపై బెట్టుకు
యెండన బడి నడచి పోవు ఇంతిని గనుచున్
మెండుగ దాహము వేయగ
కుండన గల పీథమును గ్రోలె గుట్టుగ రవియే!!!

కందం —3

మంటలు రేపే సూరుడ
తుంటరి తనమేల నీకు తొయ్యలి నీటిన్
వెంటదగిలి ద్రాగితివే!
కంటన నీరొలుకు సకికి ఘటమును జూడన్!!!

పద్యమాలిక - 1









జ్యోతి వలభోజుగారు నిర్వహించు ఇ మేగ్జైన్ మాలిక లో ఇచ్చిన చిత్రమునకు  ప్రచురింపబడిన నా పద్యములు...


భర్త గారి జేబు బాగుగా కనిపింప
ఫస్టు మాట మరచి పర్సు జూడ
కాన వచ్చెనందు కాగితం బొక్కటి
ఫూలు జేసె పతియె మేలు గాను !!!


గుట్టుగ దాచగ సొమ్మును
కొట్టెను పతి జేబునుండి కోమలి పర్సున్
బిట్టుగ దెరువగ నహహా !
నట్టింట్లో ఫూల యెనుగ నారీ మణియే!!!


చెక్కుచు రేఖల నింపుగ
చక్కని కార్టూను మలచి సంతస మిడగా
పెక్కురు సొగసుగ నల్లరె !
మక్కువతో పద్యములను మాలిక యందున్ !!!

పద్యమాలిక - 5






జ్యోతి వలభోజుగారు నిర్వహించు ఇ మేగ్జైన్ మాలిక లో ఇచ్చిన చిత్రమునకు  ప్రచురింపబడిన నా పద్యములు...


బట్టలు బాదుచు నీవట
బట్టితి మరి గరిటె నేను బావా! గనుమా!
నెట్టున కులసతులుండగ
పట్టదె! నాధులకు బాధ పంకజనాభా !!!

నట్టింటనుండు సతులే
నెట్టింట్లో పీఠమేసి నేర్పుని జూపన్
గుట్టుగ సంసారంబును
నెట్టగ కుడియెడమలైన నేరము గాదే!
!

పద్యమాలిక - 4



జ్యోతి వలభోజుగారు నిర్వహించు ఇ మేగ్జైన్ మాలిక లో ఇచ్చిన చిత్రమునకు  ప్రచురింపబడిన నా పద్యములు...


పెట్టితి భోగీ మంటను
హిట్టందురు నెట్టులోన నిది జూడగనే
చుట్టము లందరు వరుసగ
కొట్టరె మరిలైకులనుచు కోమలి మురిసెన్!!!

Sunday, August 21, 2016

దత్తపది - 85

దత్తపది- 85



పాప - రూప - దీప - తాప

పై పదాలను ఉపయోగిస్తూ `దీపావళి' పర్వదిన ప్రాశస్త్యాన్ని తెలుపుతూ

మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

తాపము నణచగ భువిలో 

పాపపు నరకుని వధింప  భామయె పతితో


రూపము దాల్చగ హాళియె


దీపపు వెలుగులను దెచ్చె దీపావళియే!!!

దత్తపది - 86

                                      దత్తపది - 86


అసి - కసి - నుసి - మసి

పై పదాలను ఉపయోగించి సూర్యోదయాన్ని వర్ణిస్తూ

మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.



అసితము బట్టిన జగతిని

మసినే తరలించి వేగ మహమును నింప


న్నుసిజేయ నిశిని రవియె వి


కసితము లయ్యె కొలకువున కంజాతములే!!!

దత్తపది - 89



                                         దత్తపది- 89


మబ్బు - వాన - జల్లు - వరద

పై పదాలను ఉపయోగించి భారతార్థంలో

మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.




ధర్మరాజును పాచికతో కొట్టిన విరాటరాజుతో ద్రౌపది.....

ధర్మమూర్తిని భూ'వర ద'యను మాలి


గొట్టనిట్టుల 'వాన'లు గురియకచట


జరుగుబడిలేక ప్రజలంత 'జల్లు'మనరె


'మబ్బు' బట్టును పాలన మట్టి పైన


భట్టు తలనుండి రుధిరంపు బొట్టు బడిన


విన్నవించెను సైరంధ్రి విరటునకును !!!

Friday, August 19, 2016

దత్తపది - 88

                                                                              దత్తపది


నాలుగు పాదాలను ‘తల’తో ప్రారంభిస్తూ

పతికై నిరీక్షిస్తున్న నాయిక స్వగతాన్ని తెలుపుతూ

మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.



తలలో పూవులను దురిమి

తలవాకిట వేచి యుంటి తత్తర పడుచున్


తలపులలో నిన్ను నిలిపి


తలపోయుచు నలసిపోతి దయగన రావే!!!