Saturday, July 11, 2009

భావకవి

' ఆకులో ఆకునై , పూవులో పూవునై ,
కొమ్మలోకోమ్మనై .నునులేత రెమ్మనై
అడవి దాగిపోనా ,ఎటులైన ఇచటనే ఆగిపోనా '

మధురమైన పద సంపద అందరికీ కరతలామలకం కదా , భావకవి కృష్ణశాస్త్రి గారు , భావనామయమైన జగత్తులోమనలందరినీ మురిపించి మైమరపించే ఎన్నో పాటలు, కవితలతో , అలరించిన మహానుభావులు . పరోక్షంగా నాకు , నాలాంటి వారెందరికో గురువుగారు . మా నాన్నగారికి కృష్ణశాస్త్రి గారంటే తగని మక్కువ. అలా మా నాన్న గారు అతనికవిత్వం గురించి చెపుతుండగా విని, విని ,చిన్నప్పటినుండి నేను కూడా శాస్త్రి గారి అభిమానిని అయ్యాను .. ఎన్నోసార్లుకనులు చెమ్మగిల్లిన సందర్భాలు, అతని కవితా లోకంలో విహరిస్తున్నపుడు ..మచ్చుకు ఒక్కటి మీతో చెబుతున్నా,

"నా విరులతోట పెంచికోన్నాడ నొక్క
పవడపు గులాబి మొక్క నా ప్రణయ జీవ
నమ్ము వర్షమ్ము గా ననయమ్ము కురిసి '
నా పూ తోటలో ఒక మంచి గులాబి మొక్కని ప్రేమనే వర్ష ధారలని ప్రతీక్షణం కురిపించి పెంచుకుంటున్నాను
, ' ఎట్టు లది దాపురించేనో ఏమో యంత
నాకుసందుల త్రోవల నల్ల దిగియే
నొక్క క్రూరార్క కిరణమ్ము వుర్వి వాలి
నా గులాబి సోలి తూలి నన్ను వీడె'
అతని భార్యని కొల్పొయినపుడు కవితని ప్రసవించిందట అతని కలం , అంత ప్రేమగా పెంచుకుంటున్న గులాబిపైవాడి అయిన కిరణాల వేడి తగిలి గులాబీ వాడిపోయి తనని వీడెనని అనంతమైన భాధని పదాలలో పదిలపరచి గులాబిని , తద్వారా అతని భార్యను అమరం చేసారు మన కృష్ణశాస్త్రి గారు . ఇలాంటి భావనలు ఎన్నో కృష్ణపక్షం లో, వూర్వశి లో మననిపలకరిస్తాయి .. అలాగే మేఘసందేశం సినిమాలో , ' ముందు తెలిసినా ప్రభూ , మందిర మిటు లుంచేనా, మందమతిని నీవు వచ్చు మధుర క్షణ మేదో కాస్త ముందు తెలిసినా ' పైకి ఆరాధన ,లోపల ఆవేదనానిబిడీకృతమై , అనంత అర్ధాన్ని నింపుకున్న పాట కూడా నాకు చాలా ఇష్టం .. ఇలా ఒకటేమిటి ఎన్నో ,...మళ్లేమరోసారి ఈ మహాకవి గురించి మననం చేసుకుందాము ...

1 comment: