Thursday, June 16, 2016

ఆవకాయపద్యాలు..



జ్యోతి వలభోజు గారి నిర్వహణలో e-book  కొరకు నేను వ్రాసిన ఆవకాయపద్యాలు....


కరివదనా! నిన్ను దలచి!
పరిమళమిడు నావకాయ పద్యము లల్లన్
మురియుచు కలమును బట్టితి
ధరమెచ్చెడి భావములిడి దయతో గనుమా!!!


చక్కనిది యావకాయయె
ముక్కను కొరకంగ చాలు ముక్కంటియు దా
మక్కువతో మరి వదలక
చక్కగ జాడీని బట్టి చను నిజపురికిన్!!!


ముక్కల తో పెట్టగనిది
సొక్కని వారెవ్వరుంద్రు సురభిని జూడన్
పెక్కురు ప్రతిరోజు దినెడు
చక్కని దగు నావకాయ జయజయ జయహో!!!

చక్కని మామిడి కాయలు
ముక్కలు గొట్టించి మురిసి పూనిక తోడన్
ముక్కోటి దేవతలకున్
మ్రొక్కుచు మరి నావకాయ మొదలగు నిండ్లన్ !!!

ఆపదల నాదుకొనునిది
చూపరులకు విందుజేయు చుర్రను దినగా!
తీపిని జేర్చిన బహురుచి
గోపాలుడు మెచ్చెనంట గోముగ దీనిన్!!!

ఎండా కాలము నందున
నిండుగ మన గుండెతాకు నేస్తంబిదియే!
మెండుగ బెట్టుదు రందరు
యండగ తానుండుగాదె యతివల కెపుడున్!!!



కూరిమిగ నావకాయను
నోరారన్ దినని వారు నుర్విని గలరే
యూరిన యూటను జూడగ
సూరియె చవిజూడవచ్చు సుఖముగ నిలకున్!!!



కొమ్మలు వండెడి పప్పున
నిమ్ముగ మరి దోసెలందు నిడ్లీలందున్
గుమ్ముగ పెరుగన్నమునన్
కమ్మగ తా నొదుగు నావ కాయయె సుమ్మా!!!

గారెలు బూరెలు వడలున్
తీరుగ పొంగలి నిజేసి దేవర నీకై
కూరిమిగ నావకాయను
చేరువలో నుంచినారు చేకొనుమయ్యా!!!

ఆంధ్రులకు చెందు సొత్తిది
యాంధ్రమున జనించెనిదియె నధికారముగన్
నాంధ్రమున మాత తానయి
యాంధ్రులకా నావకాయె యాదరువయ్యెన్!!!


ఆవకాయ దినని యాంధ్రుడు లేడయా    
ఆవకాయ లేని యవియె గలదె
ఆవకాయె మనకు నమృత సమానము

ఆవకాయ గాదె నాంధ్రమాత!!!

No comments:

Post a Comment