Saturday, December 7, 2013

శంకరాభరణం...(పాండుకుమారులు నలుగురు పదుగురు మెచ్చన్)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...

సమస్యా పూరణ...పాండుకుమారులు నలుగురు పదుగురు మెచ్చన్...


 అండగ హరితా నుండగ
గండము లెన్నైననుగాని గాండీవముతో
చెండాడుదునుగద పార్ధుడు
పాండుకుమారులు నలుగురు పదుగురు మెచ్చన్


కుంతితో ..భీముడు..

కొండను పిండిని జేసెడి
భండన భీముండునుండ భయమును విడుమా

చెండాడి వత్తు బకుడిన్
పాండుకుమారులు నలుగురు - పదుగురు మెచ్చన్

శంకరాభరణం...(పాలను గ్రోలిన మనుజుడు పాపాత్ముడగున్)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి, కృతజ్ఞతాభివందనములతో..
సమస్యాపూరణ....పాలను గ్రోలిన మనుజుడు పాపాత్ముడగున్
మేలగు శక్తిని బొందును
పాలను గ్రోలిన మనుజుడు,పాపాత్ముడగున్
పాలను త్రాగెడి దూడను
కాలుని వలెమూతిగట్టి వదిలెడు వాడున్




బాలలకు పాలు నీయక
పాలను లీటరులగొలది ట్టుక జనుచున్
బాలల శరణాలయమున
పాలను గ్రోలిన మనుజుడు పాపాత్ముడగున్


ఏలనయాగోపాలా
పాలను గ్రోలిన మనుజుడు పాపాత్ముడగున్
చాలును నీపరిహాసము
పాలను ద్రాగుమనమిటుల పలుకుట తగునా

శంకరాభరణం..(సైంధవుడు చంపె భీముని సమరమందు)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి, కృతజ్ఞతాభివందనములతో...

సమస్యా పూరణ...సైంధవుడు చంపె భీముని సమరమందు



భీకరమ్ముగ పోరాడి భీము డగుచు
వీరు నభిమన్యు నెదిరించ వీలుపడక
బాలు డనిగూడ జూడక బంధుజనము
సైంధవుడు చంపె భీముని సమరమందు

శంకరాభరణం (కాల చక్రము నాపుట కడు సులభము)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..

సమస్యా పూరణ..కాల చక్రము నాపుట కడు సులభము




కరము నందున కన్పడి కాంతి నొసగి
వేన వేలుగ రూపాల వెల్లి విరిసి
కాల వివరము దెలుపుచు కదలు చేతి
కాల చక్రము నాపుట కడు సులభము

Wednesday, December 4, 2013

శంకరాభరణం...(గొడ్డు రాలిబిడ్డలు గుణకోవిదులట)



శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతలతో....

సమస్యా పూరణ...గొడ్డు రాలిబిడ్డలు గుణకోవిదులట....

కన్న బిడ్డలె చూడని కాల మిదియె
ప్రేగు బంధము కాకున్న ప్రేమ తోడ
బెంచి పోషించి మమతనే బంచి నట్టి
గొడ్డు రాలిబిడ్డలు గుణకోవిదులట

శంకరాభరణం..(ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా )


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..

సమస్యా పూరణ......ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా



తలచుచు రాముని మదిలో
నిలచెను రాఘవునిజూడ నిత్యము శబరీ
పిలుచుచు వచ్చిన ప్రభునికి
ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా



తలచుచు రాముని కొరకై
నిలుచుచు శ్రీరాము పిలుపునే శబరి వినెన్
సలిపి సమర్చన ప్రభునకు
ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా!


మలమల మాడుచు నెండకు
నిలిచెడు జనులకు గొడుగుగ నీడనొసంగున్
బలవంతముగా గొట్టిన
ఫలశతము నొసంగె జీర్ణ పాదప మౌరా!