Monday, September 21, 2015

గణపతి ..గణనయంత్రము..


 సీసపద్యం..

ముల్లోకములు తిప్పు మూషిక రాజమే
......మౌసు గా తానయ్యి మహిని జూప
ఘంటమ్ము బట్టక గణనాధు డీవేళ
......గణనయంత్రము బట్టె కాల మహిమ
బాహుబలిగ తన బలమును జూపిన
.......జనుల తెలివి జూసి జడుపు బుట్టి
ఇంటిపట్టున నుండి ఇంటరునెట్టున
.......ధరను జూచుచునుండె కరివదనుడు

ఆ.వె..
మట్టి ప్రతిమలుంచి మంచిగా బూజించు
భక్త జనుల గాంచి భళిర యనుచు
చవితి యుత్సవముల సంబరాలు గనుచు
మోదకములు దినుచు మురియుచుండె!!!


Saturday, September 19, 2015

కలువలు విరిసే....







తెలివెన్నెల చిలికించుచు
చెలువల నుడికించు హిముని చేతలు గనుచున్
కిలకిల నగవుల మురియుచు
గలువలు వికసించె నదివొ కాసారమునన్ !!!


Friday, September 18, 2015

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..




వందనము విఘ్ననాయక
వందనమిదె పరశుధరుడ పార్వతి తనయా
వందనము వక్రతుండా
వందనము గణేశ నీకు వందనశతముల్!!!




చేకొని పత్రిని విరులన్
శ్రీకరముగ బూజ జేతు సిద్ధిగణేశా
ప్రాకటమగు వరములొసగి
సాకతమిడి గావు మయ్య శంకర తనయా!!!


బాధ్రపద శుద్ధ చవితిన భవ్యముగను
బొజ్జదేవరను దలచి భూరిగాను
భక్తి తోడను బూజింప భాగ్యమిడుచు
విఘ్నములు తొలగించునా విఘ్నరాజు !!!



Tuesday, September 8, 2015

విద్యాధనం సర్వధనప్రధానమ్.............





విద్యయె నిగూఢ యోగము
తధ్యముగా నిచ్చు నదియె ధనమును యశమున్
విద్యయె వివేక మిడుచున్
సద్యోజాతుడుని దెలియు సన్మతి నీయున్!!!

విద్యయె కీర్తియు కనకము
విద్యయె చుట్టము గురుండు విశ్వపుడదియే
విద్యయె వీడని నేస్తము
విద్యయె నీ నీడ గాదె విశ్వము నందున్ !!!


తరలించుకు పోలేనిది
పరులెవ్వరు దోచ లేని భాగ్యం బిదియే
సిరులన్నియు తొలగినను
స్ధిరముగ నీతోనె యుండు సిరిగద చదువే
!!!

Saturday, September 5, 2015

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు...






 గురుదేవులకు ప్రణమిల్లుతూ...


గురుపూజోత్సవ దినమున
గురుదేవో భవ యనుచును కూరిమితోడన్
గురువులను గౌరవించుట
గురుతర భాద్యతగ నెఱిగి గొలువుము పాఠీ!!!


కృష్ణాష్టమి ....


రావయ్యా మురళీధర
రావయ్యా నల్లనయ్య రాధాకృష్ణా
రావయ్యా వెన్నదినగ
రావయ్యా మమ్ము బ్రోవ రాగుణజాలా!!!


దేవకి నందన కృష్ణా
యోవారిజ పత్ర నేత్ర యో యవనారీ
రావేల దీన భాంధవ
గోవర్ధన ధారి నీకు కూర్నినిషాతుల్!!!

వందనము భక్తవరదుడ
వందనము మురారి శౌరి వంశీధరుడా
వందనమో మైందహనుడ
వందనము యశోద తనయ వందన మయ్యా!!!


దేవకి నందన ధీరజ ! కృష్ణా !
శ్రీవర దాయక శ్రీకర ! కృష్ణా !
గోవులు గాచిన గోపతి! కృష్ణా !
బ్రోవవె మమ్ము సుపూజితకృష్ణా!!!



వారిజ లోచన వందిత కృష్ణా!
ధారుణి గాచిన దాతవు కృష్ణా!
కోరి భజించెద గోపిక కృష్ణా !
నేరము లెంచకు నిర్మల కృష్ణా!!!