Friday, October 14, 2016

సిద్ధిధాత్రి



                                              సిద్ధిధాత్రి






తొమ్మిదవనాడుముదముగ
అమ్మని సద్భక్తి తోడ నర్చన జేయన్
నెమ్మినిడి సిద్ధిధాత్రియె
నెమ్మనమున గోర్కెలన్ని నెరవేర్చునిలన్!!!



స్థిరముగ కమలమునందున
కరముల శంఖమ్ము మరియు కమలమ్ములతో
శరణను వారిని నిరతము
కరుణించెడు సిద్ధిధాత్రి కైచాపులివే!!!

మహాగౌరి


                                                మహాగౌరి


అష్టమ దినమున భూరిన్
స్పష్టంబగు ధవళవర్ణ భాసము తోడ
న్నిష్టముగ మహా గౌరియె

శిష్టుల రక్షించి భువికి సిరులనొసంగున్!!!

Friday, October 7, 2016

కాళరాత్రి...


                                                                           కాళరాత్రి


ఏడవ దినమున శ్రద్ధగ
వేడుకతో కాళరాత్రి పేరు జపింపన్
పీడలను జేరనీయక

పోడిమితో నరయు సతికి మ్రొక్కదనెపుడున్!!!




కాత్యాయనిీ దేవి..



                                                                            కాత్యాయని

కాత్యాయన ముని పుత్రిక
కాత్యాయని దేవి గొలువ కమనీయముగన్
సత్యమగు తల్లి కరుణను
నిత్యము మరి బొందగలరు నిజభక్తులిలన్!!!


ఆరవ దినమున భక్తిగ
గారవముగ బూజసేయ కాత్యాయనినే
కోరిన గోర్కెలు దీర్చుచు
ధారుణిలో జయము లొసగు తల్లికి ప్రణతుల్!!!

Wednesday, October 5, 2016

స్కందమాత


                                            స్కందమాత

స్కందుని యొడిలోనిడుకొని
యిందీవరములు మెరియగ నిరుచేతులలో
నందముగ నభయమిడుచు

న్నందరకును స్కందమాత నాశిసు లీయున్!!!


పంచమదినమున విధిగా
మంచిగ జనులంత స్కందమాతను గొలువన్
త్రుంచుచు బాధల నిలలో
పెంచును గద సంతసమ్ము విజయములిడుచున్!!!

Tuesday, October 4, 2016

కూష్మాండ


కూష్మాండ


ఇష్టంబుగ కూష్మాండయె
సృష్టిని సృజియింపజేసె చిరుహాసముతో
అష్టభుజాదేవి గొలువ

కష్టములను దీర్చి గాచు కలకాలంబున్!!!


నవరాత్రులలో నాల్గవ
దివమున బూజించి ధూప దీపమ్ములతో
శివ సతియౌ కూష్మాండను
స్తవమును జేయంగతల్లి సౌఖ్యము లీయున్!!!

Monday, October 3, 2016

చంద్రఘంట



చంద్రఘంట


శిరమునమరి నెలవంకయు
కరముల జపమాల ఘంట ఖడ్గము దమ్మిన్
బరిసయు శూలమ్ములతో

సురుచిరమగు చంద్రఘంట జోహారులివే!!!

దేవీ-నవరాత్రులు

దేవీనవరాత్రులు


శైలపుత్రి

నవరాత్రులలో ముందుగ
శివశంకరి శైలపుత్రి  క్షేమను భక్తిన్
ప్రవరంబుగ బూజింపగ
శివముల నిడి గాచు మనల శివవల్లభయే!!!


బ్రహ్మచారిణి

పరమేశుని వరియించగ
కరమున జపమాలదాల్చి కడునీమముతో
స్థిరముగ దపమొనరించెడు
కరుణామయి బ్రహ్మవిద్య  కైమోడ్పులివే!!!

Thursday, September 29, 2016

బొట్టు శతకంలో నా పద్యములు...

                    శ్రీ రావి రంగారావు గారు నిర్వహించిన 
                          "బొట్టు శతకం"లో
                            నా పద్యములు...
తేటగీతి....
1..
వన్నె చిన్నెల బిందీలు వసుధ నున్న
చెన్నుగానుండు కుంకుమ మిన్న గాదె
పూర్ణ బింబమ్ము వలె జూడ మోము నందు
బొట్టు మెరియంగ సిరులొల్కు పూవుబోడి !!!
2
కనుబొమలమధ్య బెట్టిన కలికి బొట్టు 
శాంతి సౌఖ్యమ్మలలరారు సారసాక్షి
నడిమి వేలితో బొట్టును నయముగాను
పెట్టు కోవలె నందురు పెద్దవారు!!!
3
చంటి పాపలకందము చాదు బొట్టు
కోమలమ్ముగ నుండును కోల బొట్టు
కట్టు బట్టల మేచింగు కలరు బొట్టు
పెళ్లి పేరంట విందుల పొళ్ళ బొట్టు
బొట్టి వధువైన కల్యాణ బొట్టు పెట్టు!!!
4
కుంకుమను దిద్ద నొసటన గురియు సిరులు
తిలకముంచిన నుదుటన కలలు దీరు
బతుకు పండుసింధూరము పాపిటనిడ
నవ్వ వలెనుగ బెట్టిన నల్ల బొట్టు!!!
5
కట్టు బొట్టును జూడంగ గౌరవించు
వాసిగాంచెడి సంస్కృతి వదల వలదు
ఆధునీకత పేరుతో నచ్చమైన
వేష భాషల నెంచక దోషములను
చంద్రబింబపు మోమున చంద్రవదన
పెట్టుకోవలె బొట్టును ప్రీతితోడ!!!
Top of Form

Sunday, September 25, 2016

ఆచార్యదేవోభవ...(ఖండిక)





కందము...
గురువే బ్రహ్మయు విష్ణువు 
గురువేగద నీశ్వరుండు గురుదైవమ్మే 
గురువే సర్వము నిలలో
గురువులకివె వందనములు కువలయమందున్!!!

బడియే తొలిగుడి జనులకు 
బడిలో దైవమ్మె గురువు బ్రహ్మము తానే
బడిపంతులె సర్వులకును 
నడవడికను నేర్పుగాదె నయముగ నెపుడున్!!!


నిరతము విద్యను నేర్పుచు
పరహిత మునుగోరుచుండు వాత్సల్యముతో
సరిరారు గురువుకెవ్వరు
గురుదేవోభవ యనుచును గొలువగ రారే!!!!
ఆటవెలది..
గురుని యొద్ద విద్య కుదురుగ నేర్చిన
జయము లొదవు చుండు జగతి యందు
గురియె గలుగు గాన గురు బోధనములందు
మార్గదర్శకుడగు మంచి గురువు!!!

కందము..
గురుపూజోత్సవ దినమున
గురుదేవో భవ యనుచును కూరిమితోడన్
గురువులను గౌరవించుట
గురుతర భాద్యతగ నెఱిగి గొలువుము పాఠీ!!!


తేటగీతి...
మంచి మార్గము జూపెడు మార్గదర్శి
జ్ఞాన భోధన జేయు విజ్ఞాన వేత్త
మట్టి ముద్దను ప్రతిమగ మార్చు శిల్పి
బహు ముఖమ్ముల ప్రతిభతో బరగు యొజ్జ
నట్టి బుధులకు భక్తితో నంజలింతు!!!


మల్లెపూవు (ఖండిక)




                                                                      మల్లెపూవు

ఉత్సాహ..

చల్ల నైన రూపమున్న చక్కనైన మల్లికా
వెల్లి విరియు నీదు తావి విశ్వమందుహాయిగా
మల్లె పూల మాలలన్న మాత దుర్గ మెచ్చునే
మల్లికేశు డాదరించు మల్లె జన్మ ధన్యమే!!!

 కందము..

తెల్లని మల్లెల తావియె
యుల్లము రంజింపజేయు నుర్వీతలమున్
చల్లని వెన్నెల రేయిని
మెల్లిగ  విడు మల్లెలన్న మెచ్చరె జనముల్!!!

ఆటవెలది....

చక్కనైన సొగసు చల్లని హృదయమ్ము
మత్తు గొలుపు తావి మల్లె సొత్తు
మండు టెండలందు నిండుగా విరబూయు
మల్లె వంటి సుమము మహిని గలదె!!!

ఆటవెలది..

కవుల కలములందు కావ్యనాయకి మల్లె
సరసుల మురిపించు సఖియ మల్లె
మధుర ప్రేమ కొరకు మలిగి పోవును మల్లె
స్వార్థపరత లేని సౌమ్య మల్లె!!!




Monday, September 5, 2016

వినాయకచవితి....




ఏకవింశతి పత్రి పూజ....
సీసపద్యం....

విఘ్ననాయక నిన్ను వేడ్కతోబూజింతు
.........చక్కంగ నిరువది యొక్కపత్రి
మామిడి దానిమ్మ మరువమ్ము గండకీ
...........ఉమ్మెత్త నశ్వద్ధ నుత్తరేణి
మారేడు జిల్లేడు మద్ది జమ్మియు మాచి
........దేవదారు తులసి రావి జాజి
గరిక మునగ విష్ణు క్రాంతయు రేగుయు

..........చిన్న ములక దెచ్చి శ్రీకరముగ
ఆటవెలది....
వెండిపళ్ళెరమున మెండుగా మేలైన
పంచభక్ష్యములిడి భక్తితోడ
దీపములను బెట్టి ధూపహారతులిడి
వేడుకొంటిమయ్య విఘ్నరాజ!!!
కందము...
నిన్నే మనమున దలచుచు
నిన్నే నిరతము గొలిచితి  నిజముగ ణేశా
దన్నువి నీవని నమ్మితి
చెన్నుగ మము గావరావె సింధురవదనా!!!


వందనము విఘ్ననాయక
వందనమిదె పరశుధరుడ పార్వతి తనయా!
వందనము వక్రతుండా
వందనము గణేశ నీకు వందనశతముల్!!!


Wednesday, August 31, 2016

శంకరాభరణం..2015 సమస్యాపూరణలు..

                                      శంకరాభరణం బ్లాగులో 
                                       2015 లో
                        శ్రీ కందిశంకరయ్య గురువుగారు ఇచ్చిన                                                             సమస్యలకు నాపూరణలు.
గురువుగారికి కృతజ్ఞతలతో...

కొత్తసంవత్సరము దెచ్చె కోటి వెతలు..(1)

శ్రీకరమ్ముగ వచ్చెను సిరులు గురియ
కొత్త సంవత్సరము, దెచ్చె కోటి వెతలు
సుందరనగరము విశాఖ సొగసు గూల్చి
మూడు జిల్లాల జనులకు ముప్పు తెచ్చి
పాత వత్సర మెంతయో కోత బెట్టె !!!

.కొత్తసంవత్సరమున ముక్కోటి వెతలు..(2)

ఏడు కొండల రాయుని వేడుకొనగ
కీడు పీడలు రాకుండ చూడు నతడె
కొత్త సంవత్సరమున ముక్కోటి వెతలు

దీర్చి సకల సౌఖ్యములిడు ధిషణి యందు!!!

మద్యపాన రతుడుమాన్యుడగును.........(3)

చిత్తు గాను త్రాగి మత్తులోన మునుగు
మద్యపాన రతుడు, మాన్యుడగును
చెత్త మందు వీడి చిత్తమందున భక్తి
విత్తు నాట బొందు విమల యశము!!!

పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్!!!..(4)

మితిమీరిన చేతలతో
వెతలను బెట్టెడు మహిషుని పేరడగించన్
మతిహీనుండగు దానవ
పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్!!!......

దీనుల బ్రోచువారలను దిట్టిన గొట్టిన బుణ్యమబ్బురా ..(5)

మానవ సేవజేసినను మాధవసేవని మాన్యులందురే !
దానము జేయువారినిల దండన జేయుట ధర్మమవ్వదే ?
దీనుల బ్రోచువారలను దిట్టిన గొట్టిన బుణ్యమబ్బురా ?
పూనికతోడ జేయు సెస పోడిమి నిచ్చును మానవాళికిన్ !!!

తెలవాఱగ తూర్పు దెసను దిమిరము గ్రమ్మెన్ !!!.........(6)


కలనము వేళల విధిగా
నెలమేపరి బట్టుగాదె నేర్పుగ పాథిన్
తిలకించగ వసుధ నపుడు
తెలవాఱగ తూర్పు దెసను దిమిరము గ్రమ్మెన్ !!!

నలినములు విచ్చె కొలనున
తెలవాఱగ తూర్పు దెసను , దిమిరము గ్రమ్మెన్
నల పశ్చిమ దేశములన్
కలువలు కుసుమించు నపుడు కాసారమునన్ !!!

రామ - భరత - లక్ష్మణ - శత్రుఘ్న
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి....(7)
దత్తపది...

రావె గావగ లోకాభి రామ కృష్ణ!
భరత వంశపు ఖ్యాతియే భ్రష్టు పట్టె
పాండు సుతులు శత్రుఘ్నులై బండబాఱె
మాన రక్షక లక్ష్మణా మహిమ జూపు!!!

రామ! పాంచాలి జూడుమ రాజు సుతుని !!!...(8)

స్వయంవరములో ద్రౌపదితో కృష్ణుడు..

భరత వంశపు వీరుడు పార్ధుడతడె
సకల లక్ష్మణములుగల సవ్యసాచి
పవర మందున శత్రుఘ్న బలుడితండు
రామ! పాంచాలి జూడుమ రాజు సుతుని !!!


సిధ్ధు డైన వాడు బుద్ధి చెఱచు !!!......(9)

బుధ్ధి బలము పెంచి ముక్తి మార్గము జూపు
సిధ్ధు డైన వాడు, బుధ్ధి చెరచు
మూఢ భోధ జేసి ముప్పున బడవేయు
చదువు లేని వాడు సాధువైన

చిత్త శుద్ధి లేక శ్రీరంగనీతులు
చెప్ప నేమి ఫలము గొప్ప గాను
శుధ్ధి లేని మనసు సిధ్దిని బొందునా ?
సిధ్ధు డైన వాడు బుద్ధి చెఱచు !!!



(10)అంశం- ...కైక వరములు.
నిషిద్ధాక్షరము - ....
ఛందస్సు - తేటగీతి...


ధశరధుని మూడవసతియె దయను మాలి
పంపుమయ్య రాముని వనవాస మిపుడు
జీవనుడు భరతుని రాజు జేయమనుచు
వరముల నడిగెను పతిని వరుస గాను !!!