Monday, November 30, 2015

గురజాడ శతవర్ధంతి సందర్భంగా....


 
గురజాడ


            శ్రీ గురజాడ అప్పారావుగారు 1910 లో రచించిన  ఈ దేశభక్తి గేయం, నాడు  ప్రజల్లో దేశభక్తిని రగిలించి దేశాభివృద్ధికై  కార్యోన్ముఖులను జేసింది..ద్వారం వెంకట స్వామి నాయుడుగారు ఈగేయానికి స్వరాలను కూర్చారు..అప్పటికీ ,ఇప్పటికీ ఎప్పటికీ ఈ గేయం పాడుతున్నా వింటున్నా

ప్రతీ తెలుగువారి హృదయాలను తట్టిలేపి దేహాన్ని  పులకింపచేసే శక్తి యున్న ఆర్ధ్రత గలిగిన గేయమిది...అలాగే విశ్వవిఖ్యాతి నొందిన కన్యాశుల్కం...ఇంకా కన్యక..పూర్ణమ్మ..ఇవన్నీఆనాటి సామాజిక పరిస్ధితులను మన కళ్ళముందు సాక్షాత్కరింప జేస్తాయి...

          విజయనగరం..గురజాడఆడుగుజాడలు, అడుగడుగునా ఆనవాలుగా నిలుపుకున్ననగరం వారు పనిచేసిన ఎమ్ ఆర్ హైస్కూలు , ఎమ్ ఆర్ కాలేజ్ , కదం తొక్కే వారి పదాల మాధుర్యాన్ని ఆస్వాదించిన స్వగృహం... ఇవన్నీ ఈరోజు ఆ మహనీయని దలచుకుని తమ మమతను చాటుతున్నాయి..వారింటి ముందునుండి ఎప్పుడు వెళ్ళినా వారిని, వారి సాహిత్యాన్ని మననం చేసుకుంటాను ..నేననే కాదు.. విజయనగరంలోసాహిత్యాభిమానులందరూ  వారి ఇంటిని ఓ గుడిలా భావిస్తారు...ఇప్పుడు ఆ ఇంట్లో లైబ్రరీ వుంది..ఇంకా మేడమీదన ఆయన వాడే జ్ఞాపికలు (కుర్చీ ,కళ్ళజోడు) వగైరా వున్నాయి.. 

         గురజాడ అప్పారావుగారు , ఆదిభట్ల నారాయణదాసుగారు,ఘం టశాల,సుశీలమ్మ, ద్వారం నాయుడుగారు..కోడి రామ్మూర్తిగారు, చాసో..ఇంకా ఎందరో మహామహులు రచయిత్రులు కవయిత్రులు మేటికవులు నడయాడిన ఈ నేల గాలిలో కూడా సంగీత,సాహిత్యాలు లీనమై ఆహ్లాదాన్ని అందిస్తాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు.......అటువంటి విజయనగరం మా వూరు కావడం మా అదృష్టం..

చివరగా ....
              అన్నదమ్ములవలెను జాతులు
            మతములన్నియు మెలగవలెనోయ్
 
                   దేశమంటే మట్టి కాదోయ్
                   దేశమంటే మనుషులోయ్.....
  

 

అన్న గురజాడవారి మాటలు అనవరతం అందరికీ ఆదర్శం కావాలనీ.. ఆచరణలో తేవాలనీ..భావికి,  దేశం లో.. మట్టి మాత్రమే, కాక మనుషులు కూడా మిగలాలని ఆశ..ఆకాంక్ష...

         

Friday, October 23, 2015

దుర్గామాత....


దుర్గామాత



మత్తకోకిల...


అండ పిండము లందు నీవెగ నాదిశక్తి మహేశ్వరీ !
చండ చండిక భద్రకాళిక చర్చ ఛాయ సనాతనీ   !
హిండి చండి భవాని మాతృక యీశ్వరీ సురసుందరీ!
నిండు భక్తిగ నిన్ను గొల్చితి  నేరమెంచకు శారదా!!!


 

Wednesday, October 21, 2015

సిద్ధిధాత్రి ...


 
సిద్ధిధాత్రి



మత్తకోకిల.....


సిద్ధి ధాత్రి! శివాని శంకరి సింహవాహిని చండికా!
సిద్ధయోగుని యర్దభాగిని శ్రీగిరీ భ్రమరాంబికా !
బుద్ధి విద్యల నిచ్చి గావుమ భూతమాత చతుర్భుజా!
వృద్ధి చెందగ సర్వ సిద్ధులు వేడ్కతోకరుణించుమా!!!


 

Tuesday, October 20, 2015

మహాగౌరి...


 
మహాగౌరి

 
మత్తకోకిల...


చల్లనైనది గౌరి  రూపము చాంద్రి మల్లెల నొప్పుచు
న్నెల్ల లోకము లేలు శాంభవి యిందుమౌళి సభర్తృకా
పల్లవించుచు నందివాహని భాసమాన చతుర్భుజా
తల్లి మమ్ముల బ్రోవు నిత్యము దాక్షి దుగ్గి మహేశ్వరీ!!!


 

Monday, October 19, 2015

కాళరాత్రి....


 
కాళరాత్రి




మత్తకోకిల.....



కాళరాత్రి! కిరాతి కర్వరి కాంతి రూపిణి వందనమ్
కాల దేహిని దైత్యనాశిని కప్పుటైదువ వందనమ్
నీలకేశిని భక్తపాలిని నీలలోహిత వందనమ్
జ్వాలలోచని గార్ధవాహన ఛాయ చండిక వందనమ్!!!

Sunday, October 18, 2015

కాత్యాయని...


 
కాత్యాయని


మత్తకోకిల...


కామితమ్ములు దీర్చు తల్లివి కల్పవల్లివి కౌశికీ !
క్షేమ దాయిని శోకనాశిని  సింహవాహిని  షడ్భుజా!
నీమ నిష్ఠల నిన్ను గొల్చిన నిండు సౌఖ్యము సర్వదా!
హైమ శాక్రి  కృపాపయోనిధి యంజలింతును భక్తితో!!!

Saturday, October 17, 2015

స్కందమాత...



స్కందమాత

మత్తకోకిల....


స్కందమాత! శివాని !పాటల! సర్వమంగళ  శైలజా!
మందహాసిని బిందురూపిణి మంజు భాషిణి మాలినీ !
స్కందు నీయొడి గారవించుచు చల్లనౌక నుజూపుతో!
వందనమ్ముల నందుకోశివ శంకరీ కరుణించుమా !!!


             

Friday, October 16, 2015

కూష్మాండ మాత....


 
కూష్మాండ


మత్తకోకిల.....



 చిన్ని నవ్వును రువ్వి సృష్టిని చిత్తరంబుగ దీర్చినా!
అన్నపూర్ణవు నాదిశక్తివి సింహయానవు నంబికా  !
సున్నితంబుగ మమ్ము గావుమ సూర్యమండలవాసినీ!
నిన్ను గొల్చెద నన్ని వేళల నీలలోహిత వందనమ్!!!

చంద్రఘంట....

చంద్రఘంట

మత్తకోకిల...




చంద్రఘంట భవాని మాలిని సర్వలోకవశంకరీ !
చంద్ర బింబపు మోము గల్గిన చారులోచని భ్రామరీ!
చంద్ర చూడుని ధర్మభాగిని సర్వపాప వినాశినీ!
చంద్రశేఖరి స్వర్ణరూపిణి సన్నుతించెద భక్తితో!!!

Thursday, October 15, 2015

బ్రహ్మచారిణి....


 
బ్రహ్మచారిణి



మత్తకోకిల...




భక్తితో నిను గొల్చు వారికి బ్రహ్మచారిణి రూపునన్
యుక్తి నిచ్చెడి బ్రహ్మవిద్యవు యోగమాయవు పావనీ!
శక్తి పాణికి కన్నతల్లివి  శాంకరీ నగ నందినీ!
ముక్తి నిచ్చెడి జ్యోతి రూపిణి మ్రొక్కు చుంటిని నేసదా!!!



Tuesday, October 13, 2015

శైలపుత్రి......


 
శైలపుత్రి
 

                                                                  దేవీ నవరాత్రులు
                                    

మత్తకోకిల.....



వందనమ్ములు  శైలపుత్రికి వందనమ్ములు ముందుగన్
విందుగా చలికొండచూలికి విశ్వమాతకు వందనమ్
సుందరంబగు శూలధారిణి శూలి పత్నికి వందనమ్
వందనమ్ములు బాలచంద్రకు వందనమ్ములు భక్తితో!!!




 

Monday, September 21, 2015

గణపతి ..గణనయంత్రము..


 సీసపద్యం..

ముల్లోకములు తిప్పు మూషిక రాజమే
......మౌసు గా తానయ్యి మహిని జూప
ఘంటమ్ము బట్టక గణనాధు డీవేళ
......గణనయంత్రము బట్టె కాల మహిమ
బాహుబలిగ తన బలమును జూపిన
.......జనుల తెలివి జూసి జడుపు బుట్టి
ఇంటిపట్టున నుండి ఇంటరునెట్టున
.......ధరను జూచుచునుండె కరివదనుడు

ఆ.వె..
మట్టి ప్రతిమలుంచి మంచిగా బూజించు
భక్త జనుల గాంచి భళిర యనుచు
చవితి యుత్సవముల సంబరాలు గనుచు
మోదకములు దినుచు మురియుచుండె!!!


Saturday, September 19, 2015

కలువలు విరిసే....







తెలివెన్నెల చిలికించుచు
చెలువల నుడికించు హిముని చేతలు గనుచున్
కిలకిల నగవుల మురియుచు
గలువలు వికసించె నదివొ కాసారమునన్ !!!


Friday, September 18, 2015

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..




వందనము విఘ్ననాయక
వందనమిదె పరశుధరుడ పార్వతి తనయా
వందనము వక్రతుండా
వందనము గణేశ నీకు వందనశతముల్!!!




చేకొని పత్రిని విరులన్
శ్రీకరముగ బూజ జేతు సిద్ధిగణేశా
ప్రాకటమగు వరములొసగి
సాకతమిడి గావు మయ్య శంకర తనయా!!!


బాధ్రపద శుద్ధ చవితిన భవ్యముగను
బొజ్జదేవరను దలచి భూరిగాను
భక్తి తోడను బూజింప భాగ్యమిడుచు
విఘ్నములు తొలగించునా విఘ్నరాజు !!!



Tuesday, September 8, 2015

విద్యాధనం సర్వధనప్రధానమ్.............





విద్యయె నిగూఢ యోగము
తధ్యముగా నిచ్చు నదియె ధనమును యశమున్
విద్యయె వివేక మిడుచున్
సద్యోజాతుడుని దెలియు సన్మతి నీయున్!!!

విద్యయె కీర్తియు కనకము
విద్యయె చుట్టము గురుండు విశ్వపుడదియే
విద్యయె వీడని నేస్తము
విద్యయె నీ నీడ గాదె విశ్వము నందున్ !!!


తరలించుకు పోలేనిది
పరులెవ్వరు దోచ లేని భాగ్యం బిదియే
సిరులన్నియు తొలగినను
స్ధిరముగ నీతోనె యుండు సిరిగద చదువే
!!!

Saturday, September 5, 2015

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు...






 గురుదేవులకు ప్రణమిల్లుతూ...


గురుపూజోత్సవ దినమున
గురుదేవో భవ యనుచును కూరిమితోడన్
గురువులను గౌరవించుట
గురుతర భాద్యతగ నెఱిగి గొలువుము పాఠీ!!!


కృష్ణాష్టమి ....


రావయ్యా మురళీధర
రావయ్యా నల్లనయ్య రాధాకృష్ణా
రావయ్యా వెన్నదినగ
రావయ్యా మమ్ము బ్రోవ రాగుణజాలా!!!


దేవకి నందన కృష్ణా
యోవారిజ పత్ర నేత్ర యో యవనారీ
రావేల దీన భాంధవ
గోవర్ధన ధారి నీకు కూర్నినిషాతుల్!!!

వందనము భక్తవరదుడ
వందనము మురారి శౌరి వంశీధరుడా
వందనమో మైందహనుడ
వందనము యశోద తనయ వందన మయ్యా!!!


దేవకి నందన ధీరజ ! కృష్ణా !
శ్రీవర దాయక శ్రీకర ! కృష్ణా !
గోవులు గాచిన గోపతి! కృష్ణా !
బ్రోవవె మమ్ము సుపూజితకృష్ణా!!!



వారిజ లోచన వందిత కృష్ణా!
ధారుణి గాచిన దాతవు కృష్ణా!
కోరి భజించెద గోపిక కృష్ణా !
నేరము లెంచకు నిర్మల కృష్ణా!!!

Saturday, August 29, 2015

రక్షాబంధన్...




నీవే తల్లియు తండ్రియు
నీవే నా సోదరుండు నీవే సఖుడున్
నీవే గురుడును దైవము
నీవే నాతోడునీడ నిజముగ కృష్ణా!!!

Friday, August 28, 2015

వరలక్ష్మిీ స్తుతి






హే జననీ! వరలక్ష్మీ
శ్రీ జలధిజ !పైడినెలత! సింధుజ ! నేత్రీ!
పూజించెద ప్రతిదినమున్
తేజోమయి! మమ్ముగాచి దీవెనలిడుమా!!!

Wednesday, August 26, 2015

బొబ్బిలి వీణ..

                                                          ....  బొబ్బిలి వీణ...
                           విజయనగరం జిల్లాలో బొబ్బిలి ..వీణల తయారీకి పెట్టింది పేరు...వీటి ప్రత్యేకత ఏమిటంటే..మైసూర్, తంజావురు వీణలు 3 చెక్కలతో తయారు చేస్తే.. బొబ్బిలి వడ్రంగులు ఒకే చెక్కతో అంటే ఏకాండీ కొయ్యతో వీణలు తయారు చేయడంలో సిద్ధహస్తులైనారు...జియోగ్రాఫికల్ గుర్తింపు లభించిన బొబ్బిలి వీణల కున్న పేరు , ప్రఖ్యాతి  మరే వీణలకు లేదనే చెప్తారు. నాడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బొబ్బిలి వీణను చూసి మురిసి, అవి తయారు చేసే సర్వ సిద్ధి వెంకటరమణను వైట్ హౌస్కు ఆహ్వానించారట.. తెలుగు వారికీ, తెలుగు నేలకు గర్వకారణం మన బొబ్బిలి వీణ.. 
                 సంగీత ప్రియులందరికీ ఈ వీణ అంటే చాలా ఇష్టం..ఎందుకంటే శృతి తప్పకుండా రాగాలు అలవోకగా పలికిస్తుందీ వీణ.. ఇంతటి వైభవాన్ని పొందిన బొబ్బిలి వీణ ప్రస్తుతం దయనీయ స్ధితితో వుందనే చెప్పవచ్చు..కారణం.. దాని తయారీకి కావాల్సిన పనస కర్ర కరువవ్వటం...ఎన్నో కుటుంబాలకి ఆధరువయిన ఈ కళని ,కళాకారులని ప్రభుత్యం మరికొంతగా ప్రోత్సహించినట్లయిన బొబ్బిలి వీణ పదికాలాలు సుమధుర రాగాలు పలికిస్తూ మనదేశానికి వన్నెతెస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు...

Tuesday, August 25, 2015

విజయనగరం దగ్గర రామతీర్ధం....

                                                        రామతీర్ధం దేవాలయం
                         

                                 రామతీర్ధం దేవాలయం విజయనగరానికి 8 కిలోమీటర్ల దూరంలోవుంది..ఒంటిమిట్ట తో సమానమైన అతి పురాతన దేవాలయం ఇది ..అక్కడ ప్రచారంలో వున్న కధ ప్రకారం పాండవులు అక్కడ కొన్నాళ్ళు విడిది చేసినట్లు చెబుతారు.. ఇంకా అక్కడ దగ్గరలో వున్నగురుభక్తుల కొండ మీద భౌద్ధ ఆరామాలు ,చైత్యాలు యాగ కుండాలు వున్నాయి..రామతీర్ధం కోవెల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శీతారాములతో పాటు రామలింగేశ్వరుడు కూడా కొలువై భక్తులపూజలనుఅందుకుంటాడు..
                                 ఇక్కడ ప్రతీ ఏడాది శివరాత్రి పర్వదినమున 3 రోజులు జాతర జరుగుతుంది అశేష భక్తకోటి
కోస్తా ఆంధ్రా, ఒడిషా లనుండి తరలివచ్చి కన్నుల పండువగా జరుగు జాతరను దర్శించు కుంటారు...ఇంకా ఫ్రతీ ఏడాది శ్రీరామనవమి న సీతారామకల్యాణం, రధాయాత్ర భక్తులను ఆనంద పారవశ్యంలో ఓలలాడిస్తాయి...
                                ఈ దేవాలయాన్ని చేరాలంటే విజయనగరం R T C complex నుండి అరగంట ప్రయాణం , 11 రూపాయల టికెట్...ఇంకా ఆటో సర్వీస్,కేబ్స్ విరివిగా వుంటాయి , షేర్ ఆటో అయితే 15 రూపాయలు తీసుకుంటారు ...విజయనగరం వచ్చిన ప్రతీవారు రామతీర్ధంలో రాముని దర్శించి భక్తి భావంతో తన్మయులవుతారు...


 


భారత నారీమణులే
చీరలను మరచి ముదముగ జీన్సులు వేయన్
ఫారిన్ వనితలు మెచ్చుచు
శారీ లనుదాల్చు చుండె సంతోషముగన్!!!

Sunday, August 23, 2015

విజయనగరంలో...రామనారాయణం...

.....రామనారాయణం...

                ఈ రామనారాయణం..రామాయణానికి దర్పణం..ఎక్కుపెట్టిన ధనుస్సు ఆకారంలో వున్న ఈ కట్టడం సుందర ఆహ్లాదకర వాతావరణంలో చూపరులను భక్తి భావనలో విహరింపచేస్తుంది... రామాయణంలోని 72 ఘట్టాలకు... 72 విగ్రహాలతో ... 3 భాషలలో వివరణతో తెలుసుకునే సదుపాయం కూడా కల్పించబడింది..మధ్య భాగంలో 80 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం భక్తిపారవశ్యాన్ని కల్గిస్తుంది...రంగురంగుల విద్యద్దీపాల కాంతులతో అలరారుతూ, జలయంత్రాలతో అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దిన రామనారాయణం.... విజయనగరం వచ్చిన ప్రతి వారు చూసి తరించాల్సిందే.....