Sunday, March 31, 2024

గర్భకవిత్వం - నేను వ్రాసిన పద్యములు

 తేటగీతి గర్భిత ఉత్పలమాల...


ఉత్పలమాల...


వాలయమున్ ధరన్ సకల ప్రాణులు నిన్గని సన్నుతించుచు

న్నాలయమందునన్ విరుల నర్చనచేయును వేడ్కతోడ  గో

పాల !రమాపతీ! పరమ భక్తిగ గొల్చెడు వారి నెల్లరిన్

తాలిమి తో సదా సముచితమ్ముగ  బ్రోవుమ సాధుపోషకా.!!!


తే.గీ...


సకల ప్రాణులు నిన్గని సన్నుతించు

విరుల నర్చనచేయును వేడ్కతోడ 

పరమ భక్తిగ గొల్చెడు వారి నెల్ల

సముచితమ్ముగ బ్రోవుమ సాధుపోష.!!!



దమనక, మదనవిలసిత, అచల గర్భిత మణిగణనికర వృత్తం...



మణిగణనికరము..


నిరతము తలచెద నిరుపమ సుగుణా

శరణను జనులకు సరణిని  ససియున్

స్ధిరము నొసగుమయ సిరులిడి ధరణిన్

గరుడిరవుతు! హరి !కరుణను గనుమా  !!!


ససి - ఆరోగ్యము.  సంతోషము


అచలము - 1 -


నిరతము తలచెద 

శరణను జనులకు 

స్ధిరము నొసగుమయ

గరుడిరవుతు ! హరి.!!!


 మదనవలసిత - న-న-గ -2 - మధుమతి


నిరుపమ సుగుణా

సరణిని ససియున్

సిరులిడి ధరణిన్

కరుణను గనుమా.!!!


దమనకం.-న న - 3


నిరుపమ గుణ

సరణిని ,ససి

సిరులిడి, ధర

కరుణను గను.!!!

నంది గర్భిత కందము..

కం....

ప్రత్యహమందున విధిగను

సత్యము బల్కిన జనులను సమ్మోదముతో 

సత్యుడు మెచ్చును, మానవ

నిత్యము గాచును ధరణిని, నిజమును గనుమా


 సత్యుడు - రాముడు

ప్రత్యహము - ప్రతిదినము

నంది ..భ  భ 


ప్రత్యహమందున 

సత్యము బల్కిన 

సత్యుడు మెచ్చును

నిత్యము గాచును


ద్వివిధ కందము.


కం ...1

హితమగు కవితాధారణ

వితత మతీ మీకె చెల్లు విజ్ఞానఖనీ!

నతులివె,  జేజే లనరే

మతిమంతులు, మిమ్ము వర్ణ మాతృక మెచ్చున్.!!!

కం... 2

నతులివె, జేజే లనరే

మతిమంతులు, మిమ్ము వర్ణ మాతృక మెచ్చున్

హితమగు కవితాధారణ

వితత మతీ మీకె చెల్లు విజ్ఞానఖనీ.!!!