Sunday, November 5, 2017


ఆకాశవాణి వారి 'సమస్యాపూరణం' - 2

ఈవారం సమస్య....
"అమృతము విషమయ్యెఁ జూడ నాశ్చర్యముగన్"
11-11-2017 (శనివారం) ఉదయం 7-30 గం.లకు ప్రసారమౌతుంది. 

Thursday, April 13, 2017

దత్తపది- తల

నాలుగు పాదాల ప్రారంభంలో 'తల'ను అన్యార్థంలో ప్రయోగిస్తూ
ఇష్టదైవాన్ని స్తుతిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.



దత్తపది..

తలచిన బలుకుచు మాచిం
తల నిల నెడబాపు నట్టి దండ్రివి యనుచున్
దలచెద వేంకటనాధుని
తలపులలో నిలిపి సతము తన్మయమగుచున్   !!!           

  

తలచెదనే కలిమిచెలిని
తలచెదనే మరునియంబ దాక్షాయణినే
తలచుచు శ్రీ చరణమ్ముల
తలవంచి నమస్కరింతు  తద్దయు భక్తిన్  !!!

Thursday, March 23, 2017

ఖండిక-కాకరకాయ

                               కాకరకాయ- ఖండిక


కాకరకాయల కూరయె
చేకూర్చును చాలమేలు చేదుగనున్నన్
ప్రాకటమగునౌషధిగను
శాకమ్ములమేటి దగుచు స్వస్థత నిచ్చున్!!! 


కలరా నరికట్టునిదియె
వలమును తగ్గించు, కంటి వ్యాధులనెల్లన్
పొలుపుగ దూరము జేయుచు
చెలువమునిడు కాకర దిన చెలియల్లారా!!!         

అదనముగా చేదున్నను
మధుమేహమ్మునకు మంచి మందిది యిలలో
అధికబరువు దగ్గించగ
వదలక సేవించ రసము వర కాకరనే!!!           



మక్కువతో చేదు దినిన
చక్కెరవలెనుండుననుచు జనులకు పదమున్
చక్కగ దెల్పెను వేమన
నిక్కము, సందేహమేల? నెరుగరె మీరున్!!! 

  
బాగగు హరితపు వన్నెను
దాగుచు పత్రములనడుమ తనరెడునిన్నున్
తీగల తూగుచు జూడగ
సోగగు నీరూపమునకుజోహార్లివియే!!! 


పద్యరచన - కాకర


                                                        కాకరకాయ


కాకరకాయల కూరయె
చేకూర్చును చాలమేలు చేదుగనున్నన్
ప్రాకటమగునౌషధిగను
శాకమ్ములమేటి దగుచు స్వస్థత నిచ్చున్!!! 


కలరా నరికట్టునిదియె
వలమును తగ్గించు, కంటి వ్యాధులనెల్లన్
పొలుపుగ దూరము జేయుచు
చెలువమునిడు కాకర దిన చెలియల్లారా!!!         

పద్యరచన - చిత్రము

                                                               చిత్రము


తరళము...

కురియు చుండగ వర్షధారలు కూతవేయగ బండియే
పరుగు తీసిరి వేగిరమ్ముగ బాటసారులు నెక్కగన్
తరువు నీడకు బోవుచుండిరి తన్విలిర్వురు జల్లులో
వరుస బెట్టెల జూచుచుండిరి పజ్జకైమరి గొందరు
న్నరయ చిత్రము వాస్తవమ్ముగ నందగించుచు నున్నదే
పరిఢవిల్లగ బొమ్మగీసిన వర్ణి కుంచెకు ప్రాంజలుల్ ..  !!!              



పద్యరచన - సెల్ఫీ

                                               సెల్ఫీ

నెట్టున సెల్పీలుంచగ
కొట్టుచు ఫోజులను వధువు కూరిమితోడన్
కట్టంగతాళి చేతన్
బట్టుకు గూర్చుండె వరుడు భళిరే సెల్ఫీ!!!          


Monday, March 20, 2017

పద్యరచన...




శంకరాభరణంలో ఇచ్చిన చిత్రమునకు నా పద్యం..

స్కూలుకు బోయెడి పిల్లల
హేలను తాను గమనించి యేవిధి నటులన్
మేలుగ బోవుదునోయని
బాలయె మదిదలచుకొనుచు బండిని నడిపెన్!!!              

Friday, March 17, 2017

దశావతారములు

                                               దశావతారములు(ఖండిక)

వేదములను దెచ్చి నవియె
మోదంబుగ బ్రహ్మకొసగ మూకము నీవై
యీధర సోమకుని దునిమి
వేదాలను గాచినట్టి విభునకు ప్రణతుల్!!!

మంధరగిరి నెత్తగహరి
సుందర గూర్మంబువగుచు సురలను గావన్
పొందుగ నమృతము బంచుచు
బృందారకుల తలగాచు వృష్ణికి  జోతల్!!!

భూదేవిని పైకెత్తగ
భూదారమువై నయముగ బ్రోవుచు వసుధన్
మోదితివి హిరణ్యాక్షున్
నీదయను బొగడగ తరమె నీలమణినతుల్ !!!!

సరిగొన హిరణ్యకశిపుని
నరసింహుడి రూపమందు నయముగ ధరణిన్
వరమున్ ప్రహ్లాదు నరయు
వరదా నిన్నాశ్రయింతు వందనమనుచున్!!!

త్రేతాయుగమున నీవే
పాతకుడా రావణునిల పరిమార్చంగా
ప్రీతిగనుదాశరధివై
సీతను రక్షించినావె శ్రీరామనతుల్!!!


ఆదనుజుల దునుమాడగ
యాదవకులమున వెలసిన యదుకుల మణివై
భోధించితివే గీతను
మాధవ గీర్తించ నిన్ను మనజుల వశమే!!!


ఆమూడడుగుల నడుగుచు
వామన రూపంబులోన బలినణచితివే
ఏమి విచిత్రము దేవా
సామాన్యుడ గావునీవు సామీచిలివే!!!



పరశువు చేతను బట్టియు
దరణీధరులెల్ల గూల్చి ధర, దక్షిణగా
సరగున కశ్యపునకొసగు
వర భార్గవ రూప నీకు వందనశతముల్!!!

అపరాధమ్ములు వలదని
యుపదేశించగ జగతికి యోగివినీవై
చపలత్వము వీడుమనెడు
విపులను బుద్దావతార వేవేలనతుల్!!!

కలియుగమందున దేవా
కలికివిగ నవతరించి ఖలులను ద్రుంచన్
విలయపు రూపున దిరుగుచు
బలహీనుల గాచునీకు ప్రణతులనిడెదన్!!!





తెలుగుభాష

                                           తెలుగు భాష …(ఖండిక)


అమ్మ నాన్నయన్న అమృతమ్మును చిలుకు
మమ్మి డాడి యనగ మధురమేది
మాతృభాషలోన మమకారమున్నది
తెలుగు భాషవిలువ దెలుసుకొనుమ!!!

ఆంగ్ల మందు మోజు నబ్బరముగనున్న
అలుసు చేయబోకు నచ్చ తెనుగు
భావి తరములందు బాగైన నిధివోలె
విశ్వమందు తెలుగు వెలగవలెను!!!

ఇతర భాషలెన్ని యింపుగా వచ్చిన
వరము గాదె మాతృ భాషమనకు
పట్టి పట్టి బలుక పరభాష గాదయా
పలుకుమోయి తెలుగు పరవశమున!!!

అన్య భాషలన్ని యాదరమ్ముగ బల్కి
సిరుల తెలుగు బలుక చిన్నతనమె?
తెలుగు వాడిననుచు యెలుగెత్తి చాటరా
దిశలు దిగ్గనంగ నసము తోడ!!!

పదము పదము గూర్చి పద్యకవితలల్లి
బడులలోన నేర్ప బాలలకును
చిరుత ప్రాయమందె చిన్నారు లందరు
తెలుసుకొందు రిలను తెలుగు తీపి!!!


మాటలాడుచున్న మంచిగా తెలుగున
వ్రాయ లేక పోవు భాషరాక
గురువు వద్ద విద్య  కుదురుగా నేర్చిన
భాష పైన పట్టు బడయగలరు!!!


జీవమున్న భాష చేవగల్గిన భాష
తెలుగు గాకనేది కలియుగాన
బలుక కున్న దీని పదునెట్లు తెలియురా
తెలుగు సొగసు జెప్ప నలవి గాదె!!!

బాల్యమందు నిన్ను బడికిబంపునపుడు
అమ్మనాన్న నేర్పు నాంధ్రభాష
ఇక్షుకాండమంటి ఇంపైన మనభాష
బలుకు చున్నగొలది చిలుకు మధువు!!!