తెలుగు భాష …(ఖండిక)
అమ్మ నాన్నయన్న అమృతమ్మును చిలుకు
మమ్మి డాడి యనగ మధురమేది
మాతృభాషలోన మమకారమున్నది
తెలుగు భాషవిలువ దెలుసుకొనుమ!!!
ఆంగ్ల మందు మోజు నబ్బరముగనున్న
అలుసు చేయబోకు నచ్చ తెనుగు
భావి తరములందు బాగైన నిధివోలె
విశ్వమందు తెలుగు వెలగవలెను!!!
ఇతర భాషలెన్ని యింపుగా వచ్చిన
వరము గాదె మాతృ భాషమనకు
పట్టి పట్టి బలుక పరభాష గాదయా
పలుకుమోయి తెలుగు పరవశమున!!!
అన్య భాషలన్ని యాదరమ్ముగ బల్కి
సిరుల తెలుగు బలుక చిన్నతనమె?
తెలుగు వాడిననుచు యెలుగెత్తి చాటరా
దిశలు దిగ్గనంగ నసము తోడ!!!
పదము పదము గూర్చి పద్యకవితలల్లి
బడులలోన నేర్ప బాలలకును
చిరుత ప్రాయమందె చిన్నారు లందరు
తెలుసుకొందు రిలను తెలుగు తీపి!!!
మాటలాడుచున్న మంచిగా తెలుగున
వ్రాయ లేక పోవు భాషరాక
గురువు వద్ద విద్య కుదురుగా నేర్చిన
భాష పైన పట్టు బడయగలరు!!!
జీవమున్న భాష చేవగల్గిన భాష
తెలుగు గాకనేది కలియుగాన
బలుక కున్న దీని పదునెట్లు తెలియురా
తెలుగు సొగసు జెప్ప నలవి గాదె!!!
బాల్యమందు నిన్ను బడికిబంపునపుడు
అమ్మనాన్న నేర్పు నాంధ్రభాష
ఇక్షుకాండమంటి ఇంపైన మనభాష
బలుకు చున్నగొలది చిలుకు మధువు!!!
No comments:
Post a Comment