Saturday, May 18, 2013

సిరులు పొంగే.......




సిరులు పొంగే జీవగడ్డే

కరవు బారెను  పడెనురా

ఆదరించి అన్నపూర్ణే

దేవిరించెను నేడురా….

అన్నదమ్ముల మెలగు జాతుల

వింత కలహములొచ్చెరా

ఉమ్మడి కుటుంబాలూడి

ఊరుమ్మడి బ్రతుకులాయెరా

(ఉండి లేనట్టాయెరా).....

తెలుగుప్రజలకు తెగులులొచ్చి

తెగలు, తెగలై పోయెరా

పొరుగు పచ్చను ఓర్వలేక

పొగిలి ,పొగిలి ఏడ్చెరా…..

వృధ్ధశరణాలయాలు చూస్తే

అర్ధమవ్వద లోకరీతి……

అర్ధ మే పరమార్ధమాయె
వ్యర్ధజీవితం ,నిరర్ధకం…..

Friday, May 17, 2013

నన్ను కదిలించిన ...నండూరి ఎంకి....






నాటి కాలమునందు నండూరి కలమందు

నాట్యాలు చేసింది నాయుడోరి ఎంకి

నేడేమొ, ఈడేమొ, నాదు భావమునందు

కవితయై నిలిచింది కావ్యనాయకి ఎంకి

కాలాల ఎనకాల నిలచినా ఆ ఎంకి

కమనీయరూపమై కనుల కనిపిస్తాది

కనిపించి ,మురిపించి ,ఎదను రగిలించి

పదములల్లిస్తాది, పాటరాయిస్తాది

రాసినా ఆపాట నోటపలుకంగ

మురిసిపోతుంటాది, మెరిసిపోతాది

మురిసినా ఎంకి మోము చూడాలని

ఆశతో నే కనులు తెరచిచూడంగ

కలలాగ తానేమొ కరిగిపోతాది

కమనీయగాధగా మిగిలిపోతాది

పొద్దుపొడుపులోన ముద్దరాలకుమల్లె

పదమల్లెవచ్చింది,వరదంటి,ఎంకి

Monday, May 13, 2013

మావూరికి... వందనం.



                       శ్రీ శ్రీ మహాప్రస్తానం లో మరో ప్రపంచంవైపు పరుగులు తీయునపుడు,.. కృష్ణశాస్త్రి వూర్వశి తో వూసులాడి, కృష్ణపక్షంలో మునిగినపుడు, నండూరి ఎంకి జాణతనంలో సేదతీరినపుడు.. నాకూ కవిత్వం వ్రాయాలనిపించింది...అప్పటికే చిన్నచిన్నగా లిఖించే నా కలం వురవడిని, వడిని అందుకుంది..క్రమక్రమంగా కవనం ఓ వ్యసనం గా,మారింది..

                  ఏ మంచిపాట విన్నా ..ఆ ట్యూన్ కి, సరిపడే మరో బావాన్ని,కలం ఒలికించేది...ఎన్నో పేరడీలు ..మరెన్నో పాటలు..... 
                                  కవనానికి బానిసనై

                                  గమనానికి ఆశను నేనై

                                  వేశానొక వారధిని

                                   నాకు నేనె రధసారధినై...

ఆ పేరడీల నేపధ్యంలో....మా విజయనగరంపై ..నేను రాసిన పేరడీ ఇది...సంగీత, సాహిత్య, సాంప్రదాయాలకు పుట్టినిల్లు మా విజయనగరం....ఎందరో మహానుభావులు నడయాడిన ఒడి...మా వూరి సవ్వడి...ఆ సవ్వడులను మీకు కూడా వినిపించాలని ....ఈ నా పాట.....

  వహవా..యిదే విజయానగరము..

  నమహో సదా యిదె వందనం

మది మావూరి ఆకృతినె పలికెను ...వినుమరి   ........వహవా.....

1.        గురజాడ నడిచిన వాడ

          ఆదిభట్ల హరికధ జాడ..

                   మాయునా..ఏనాటికీ..

          ఆ ద్వారం... సరిగమ సారం....

          ఆనందుడే ఏలిన రాజ్యం…….మారునా....

          పరువుకే ప్రాణమిస్తుంది నగరము...

          ఎంతకూ ఒటమే లేని పంతము...

          బ్రతుకు పన్నీటి గంధము..

          శాంతినే కోరు నందనం..

                   కలసిన మనసులు..

కరములు కలిపిన

కమ్మని వేళల

          జిలిబిలి పలుకుల    ...... కిలకిల నెలవులలో.....                       వహవా...

2.                  ఘంటశాల కట్టిన పాట

గానకోకిల పుట్టిన చోట…….        గాలిలో......సంగీతమే.....

ఆంధ్రాలో జాలరి వేట

కుమ్మరి కధ ప్రతినోట          నేటికీ....

సంస్కృతి సాంప్రదాయాల సంగమం...

రాజకీయాల సౌరభం....

చెరగని చారిత్ర వైభవం...తెలుసుకోరా....

కధలకు నెలవిది...

అతిధుల కొలువిది...

మధురపు హృది యిది.....

మమతల పొదయిది...విద్యలనగరపు నగవులలో...  వహవా......

3.                  కన్యాశుల్కమే విన్నా,

సర్ విజ్జి క్రీడను కన్నా.... తల్లి..ఈనేలరా...

పైడమ్మ చల్లని మహిమా....

సిరిమాను జాతర గరిమా...          చూడరా....

వినుమరీ.... కోడిరామ్మూర్తి రీతిని...

అభినవ భీముని కీర్తినీ...

గజపతిరాజుల ఖ్యాతినీ......                  తెలుసుకోరా....

జయజయ ధ్వనముల

స్వరపద మనముల

నినదించే తావుల

కదిలించే ప్రియ మధుకర రవముల లాహిరిలో........               వహవా......
ఈ పాట దేని పేరడీనో........చెప్పాలంటారా???????

Sunday, May 12, 2013

నయనానందం...యానాం....





        మనకి దగ్గరలో వున్న అందమైన ప్రదేశాన్ని ఇంత వరకూ చూడలేదా !!.....అని అన్పించింది...

            అందమైన ఎంట్రన్స్...అంతకంటే  అద్భుతమైన బీచ్ రోడ్,ఎందరో మహానుభావుల శిలా విగ్రహాలు,... చూపరుల మనసు కట్టిపడేసేటట్లు బంగారపు రంగులో లో మెరిసే భారతమాతా నిలువెత్తు విగ్రహం,..ఆహ్లాదకరంగా రంగురంగుల లైట్లతో, ఫౌంటెన్స్ తో విలసిల్లే ఉద్యానవనాలు...ప్రశాంతసంద్రంలో పడవలు..కళాత్మకత రూపుదిద్దుకున్న సుందర గృహాలు...చక్కగా కన్పించే వీధుల పేర్లు, సుందరంగా వున్న రహదార్లు ..వెరసి యానాం ..నయనానందకరం...

          ఇవన్నీ ఒక ఎత్తు అయితే ... యానాంకి  పది కిలోమీటర్ల దూరంలో వున్న మడ అడవుల అందం మరొక ఎత్తు,..గోదావరి సాగరంలో కలిసే ప్రదేశం వరకూ బోటింగ్ చేయడం అందమైన అనుభవం..ఓ అద్భుతం...నీటిలో తేలియాడే పెద్ద వృక్షాలు...తెల్లటి కొంగలు..అందమైన పక్షులతో అలరారే కోరింగ అభయారణ్య సందర్సనం...అపూర్వం..అనిర్వచనీయమైన ఆనందం... 
మండువేసవిలో ..మలయసమీరం..".మడ అడవుల దర్శనం"

Wednesday, May 8, 2013

కవిత్వం..... ఓ జీవనగమనం



ఎంత మేధ మధిస్తేనో..

ఒక్క కవితాలత కుసుమించేది ..?



భావనాస్ఫోరకమైన భావమొక్కటియున్న

బహుకావ్యమాలికల పూలు విరజిమ్మవా

స్ఫూర్తినిచ్చేఒక్క మూర్తిత్వమే వున్న

స్ఫురియించవా వరదలా పదములే..



          ఏ కళాకారుడికైనా తన బావానికి జీవంపోయడం ..ఓ మాతృమూర్తి ప్రసవనేదనతో సమానం...బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం తల్లి ఎంత అనుభనవిస్తుందో ..అంతే ఆనందానుభూతి.. ప్రతీ కళాకారునికి కలుగుతుంది...

          పేపరు, పెన్ను,లేదా కీబోర్డు వుంటే చాలు కవిత్వం,కధలూ రాసెయ్యవచ్చుఅనే అబిప్రాయం .. కొంతమంది అనగా విన్నాను......ఓ పాటలో అనుకుంటా ఇలా వుంది...భావాలు పదునెక్కి ,..బాష ఎరుపెక్కాలి...అక్షరాలలో అగ్ని విరజిమ్మాలి,అని......భావాలు పదునెక్కితే భాష ఎరుపెక్కడమే కాదు ,ఎదలోతులను సైతం కదిలిస్తుంది, అగ్నితోపాటు,అమృతాన్ని కూడా కురిపిస్తుంది..

ఏమంటారు....?నిజమా...కాదా...!!.......
       .......... కవిత్వం లోక సాదృశ్యం...........







Wednesday, May 1, 2013

;చూడు ..చూడు...



 

అక్షరతూణీరాలను లక్షలుగా వదిలి మా కుక్షిని నింపిన మహాకవి శ్రీ శ్రీ.కి....అక్షరాంజలి ......


చూడు చూడు జాడలు

నీ వదలిన నీడలు

యుగయగలకూ తరగని

చెరిగిపోని వ్రాతలు



చూడు చూడు గోడలు

మరోప్రపంచపు మేడలు

తరతరాలకూ ఒరగని

కరిగిపోని గోడలు



చూడు చూడు క్రీడలు

పదబంధపు అల్లికలో

పదపదమను పల్లకిలో

శ్రీ శ్రీ కవితా క్రీడలు