Friday, May 27, 2016

వేంకటేశ్వరస్తుతి....








                                              
                    ... వేంకటేశ్వర స్తుతి.... 
                          (ఖండిక)

పిలిచిన బలికే దైవము
దలచిన సద్బక్తితోడ దైన్యత బాపున్
కలియుగ వేంకట నాధుని
తిలకించిన చాలు మనసు దివ్వెగ వెలుగున్ !!!


సప్త గిరులందు వెలసిన చక్కనయ్య
భక్త జనులను కరుణించు వకుళ తనయ
పిలిచినంతనె పలికెడి విభుడ నీవు
నతుల నిడెదను వెంకన్న నహరహమ్ము!!!


శంఖు చక్రంబు నామమున్ సన్నుతించి
యంజలింతును భక్తితో ననుదినమ్ము
వేంకటేశుని రూపమ్ము విస్మయమ్ము
లిప్త జూచిన నఘములు లుప్తమగును !!!


నిన్ను తిలకించి నగరున సన్నుతించి
పదసుమమ్ముల గొల్చితి పరమ పురుష
రిక్త హస్తంబు లివియని భక్తవరద
తలచ వలదయ్య హరి నన్ను దయను గనుమ!!!


వరద! వెంకట రమణుడ! వందనములు
సప్తగిరినిలయ !ముకుంద !శరణు శరణు
పద్మగర్భుడ! సిరిదొర ! ప్రణతి ప్రణతి
సంకట హరణ! హరి !కృష్ణ! టెంకటనము!!


    

No comments:

Post a Comment