కాకరకాయ- ఖండిక
కాకరకాయల కూరయె
చేకూర్చును చాలమేలు చేదుగనున్నన్
ప్రాకటమగునౌషధిగను
శాకమ్ములమేటి దగుచు స్వస్థత నిచ్చున్!!!
కలరా నరికట్టునిదియె
వలమును తగ్గించు, కంటి
వ్యాధులనెల్లన్
పొలుపుగ దూరము జేయుచు
చెలువమునిడు కాకర దిన చెలియల్లారా!!!
అదనముగా చేదున్నను
మధుమేహమ్మునకు మంచి మందిది యిలలో
అధికబరువు దగ్గించగ
వదలక సేవించ రసము వర కాకరనే!!!
మక్కువతో చేదు దినిన
చక్కెరవలెనుండుననుచు జనులకు పదమున్
చక్కగ దెల్పెను వేమన
నిక్కము, సందేహమేల? నెరుగరె మీరున్!!!
బాగగు హరితపు వన్నెను
దాగుచు పత్రములనడుమ తనరెడునిన్నున్
తీగల తూగుచు జూడగ
సోగగు నీరూపమునకుజోహార్లివియే!!!