Friday, August 19, 2016

దత్తపది - 89


                                                                             దత్తపది

మబ్బు - వాన - జల్లు - వరద

పై పదాలను ఉపయోగించి భారతార్థంలో


ధర్మరాజును పాచికతో కొట్టిన విరాటరాజుతో ద్రౌపది.....



ధర్మమూర్తిని భూ'వర ద'యను మాలి

గొట్టనిట్టుల 'వాన'లు గురియకచట

జరుగుబడిలేక ప్రజలంత 'జల్లు'మనరె

'మబ్బు' బట్టును పాలన మట్టి పైన

భట్టు తలనుండి రుధిరంపు బొట్టు బడిన

విన్నవించెను సైరంధ్రి విరటునకును !!!

దత్తపది - 91

                                          దత్తపది...


కుండ - దండ - బండ - బెండ

పై పదాలను అన్యార్థంలో ఉపయోగించి గొడుగును గురించి




వానకాలమందు బండచాకిరిజేసి

తడియకుండమనల దరిని జేర్చు


మండుటెండలందు బెండగిల్లుజనుల


దండ నుండు గొప్ప దాత గొడుగు!!!

దత్తపది-94



అసి - కసి - నుసి - రసి

పై పదాలను అన్యార్థంలో ఉపయోగించి 

పల్లె పడుచు అందాలను వర్ణిస్తూ

మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి

కందము...
అసితపు సిగలో మల్లెలు

కసిరెడు నేత్రముల నవ్వు గజగమనన్నా


రసిత్రుటి
 గందోయి మెరయ

పసగల  పడుచున్ గనరే!!!

దత్తపది



నవ్య - భవ్య - దివ్య - సవ్య 

పై పదాలను ఉపయోగించి

వైద్యవృత్తిని గురించి

మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.



దివ్యంబగువసతులతో
నవ్యమయినరీతిలోన నాణ్యతతోడన్
భవ్యంబగు సుస్థతనిడ
సవ్యంబగు వైద్యమొసగు సత్ఫలితమ్మున్!!!




Thursday, August 18, 2016

పద్యమాలిక-3




జ్యోతి వలభోజుగారు నిర్వహించు ఇ మేగ్జైన్ మాలిక లో ఇచ్చిన చిత్రమునకు  ప్రచురింపబడిన నా పద్యములు...



స్టిక్కరు నరదమ్ము నిడన్
స్టిక్కవ్వక నది యెగిరెను చిత్రము గనరే
పక్కింటికి చేరె నహహ!
చిక్కులు కొనితెచ్చి పెట్టె శ్రీవారికిలన్ !!!

చుక్కల ముగ్గును వేయగ
పక్కింటావిడయెదాని పట్టుకు బోయెన్
కిక్కురు మనకుండ రధము
చక్కగ మనయింటివైపు జరుపుము నాధా !!!


సూరి మకరరాశి నజేరు సూచనగను
సంకు రాతిరి మరునాడు సంబరముగ
కలిమి గోరెడి కాంతలు కనుమ నాడు
రధము ముగ్గును వేతురు రమ్యముగను!!!





పద్యమాలిక-3

జ్యోతి వలభోజుగారు నిర్వహించు ఇ మేగ్జైన్ మాలిక లో ఇచ్చిన చిత్రమునకు  ప్రచురింపబడిన నా పద్యములు...



సరిలేరుగ మీకెవ్వరు
సురలోకమునందుగాని సురభిన గానీ!
చిరజీవులు మీ పాటలు
తరతరములు మరువలేరు తధ్యము సుమ్మా!!!

రఫియు ఘంటశాల రాగాలు వినినంత
పరవశించి పోయె హరిహయుండు
పుడమి జేసుకున్న పుణ్యంబులేమొకొ
మహతి కఛ్ఛపిటుల మనుజులైరి !!!

రారా కృష్ణయ్య వినగ
చేరును గద నల్లనయ్య చెలులందరితో
భారత కీర్తిని పాడిన
హారతు లిచ్చెనుగనాడు హాలీవుడ్లో!!!

కఠిన ఫాషాణ మైనను కరగి పోవు
సాగు వాయువుల్ చెవియొగ్గి యాగివినును
పుడమిపరితోషమొందును పుత్రులనుచు
వాగు వంకలు నదములు ప్రమదమొందు
పుణ్య భారత మాతయె పులకరించు
ఘంటశాల రఫి మధుర గానమువిని!!!

గద్యము వినగా మధురమె
పద్యము పాడంగకరుగు గండశిలైనన్
హృద్యమ్ముసుమా పాటలు
నధ్యాయము ముగిసెనేమి? యమరులు మీరే!!!

పద్యమాలిక-2





జ్యోతి వలభోజుగారు నిర్వహించు ఇ మేగ్జైన్ మాలిక లో ఇచ్చిన చిత్రమునకు  ప్రచురింపబడిన నా పద్యములు...


పంక్తి కంఠుడు వీణ మీటిన భార్య గారికి మోదమే
పంక్తి కంఠుడు పాట పాడిన పాప మామెకు ఖేదమే
పంక్తి కంఠుని పాట వేటుకు బంటు లందరు చచ్చిరే
పంక్తి కంఠుని పాట ధాటికి పైకి పోయెను ప్రాణమే!!!



దిక్కులు వణికెను నాధా!
ముక్కంటియె తెఱచు నేమొ మూడవ కన్నే
స్రుక్కెను కింకరు లదివో!
మ్రొక్కెద మరి పాడవలదు మొత్తుము వీణన్!!!