Sunday, September 25, 2016

ఆచార్యదేవోభవ...(ఖండిక)





కందము...
గురువే బ్రహ్మయు విష్ణువు 
గురువేగద నీశ్వరుండు గురుదైవమ్మే 
గురువే సర్వము నిలలో
గురువులకివె వందనములు కువలయమందున్!!!

బడియే తొలిగుడి జనులకు 
బడిలో దైవమ్మె గురువు బ్రహ్మము తానే
బడిపంతులె సర్వులకును 
నడవడికను నేర్పుగాదె నయముగ నెపుడున్!!!


నిరతము విద్యను నేర్పుచు
పరహిత మునుగోరుచుండు వాత్సల్యముతో
సరిరారు గురువుకెవ్వరు
గురుదేవోభవ యనుచును గొలువగ రారే!!!!
ఆటవెలది..
గురుని యొద్ద విద్య కుదురుగ నేర్చిన
జయము లొదవు చుండు జగతి యందు
గురియె గలుగు గాన గురు బోధనములందు
మార్గదర్శకుడగు మంచి గురువు!!!

కందము..
గురుపూజోత్సవ దినమున
గురుదేవో భవ యనుచును కూరిమితోడన్
గురువులను గౌరవించుట
గురుతర భాద్యతగ నెఱిగి గొలువుము పాఠీ!!!


తేటగీతి...
మంచి మార్గము జూపెడు మార్గదర్శి
జ్ఞాన భోధన జేయు విజ్ఞాన వేత్త
మట్టి ముద్దను ప్రతిమగ మార్చు శిల్పి
బహు ముఖమ్ముల ప్రతిభతో బరగు యొజ్జ
నట్టి బుధులకు భక్తితో నంజలింతు!!!


No comments:

Post a Comment