Thursday, September 29, 2016

బొట్టు శతకంలో నా పద్యములు...

                    శ్రీ రావి రంగారావు గారు నిర్వహించిన 
                          "బొట్టు శతకం"లో
                            నా పద్యములు...
తేటగీతి....
1..
వన్నె చిన్నెల బిందీలు వసుధ నున్న
చెన్నుగానుండు కుంకుమ మిన్న గాదె
పూర్ణ బింబమ్ము వలె జూడ మోము నందు
బొట్టు మెరియంగ సిరులొల్కు పూవుబోడి !!!
2
కనుబొమలమధ్య బెట్టిన కలికి బొట్టు 
శాంతి సౌఖ్యమ్మలలరారు సారసాక్షి
నడిమి వేలితో బొట్టును నయముగాను
పెట్టు కోవలె నందురు పెద్దవారు!!!
3
చంటి పాపలకందము చాదు బొట్టు
కోమలమ్ముగ నుండును కోల బొట్టు
కట్టు బట్టల మేచింగు కలరు బొట్టు
పెళ్లి పేరంట విందుల పొళ్ళ బొట్టు
బొట్టి వధువైన కల్యాణ బొట్టు పెట్టు!!!
4
కుంకుమను దిద్ద నొసటన గురియు సిరులు
తిలకముంచిన నుదుటన కలలు దీరు
బతుకు పండుసింధూరము పాపిటనిడ
నవ్వ వలెనుగ బెట్టిన నల్ల బొట్టు!!!
5
కట్టు బొట్టును జూడంగ గౌరవించు
వాసిగాంచెడి సంస్కృతి వదల వలదు
ఆధునీకత పేరుతో నచ్చమైన
వేష భాషల నెంచక దోషములను
చంద్రబింబపు మోమున చంద్రవదన
పెట్టుకోవలె బొట్టును ప్రీతితోడ!!!
Top of Form

Sunday, September 25, 2016

ఆచార్యదేవోభవ...(ఖండిక)





కందము...
గురువే బ్రహ్మయు విష్ణువు 
గురువేగద నీశ్వరుండు గురుదైవమ్మే 
గురువే సర్వము నిలలో
గురువులకివె వందనములు కువలయమందున్!!!

బడియే తొలిగుడి జనులకు 
బడిలో దైవమ్మె గురువు బ్రహ్మము తానే
బడిపంతులె సర్వులకును 
నడవడికను నేర్పుగాదె నయముగ నెపుడున్!!!


నిరతము విద్యను నేర్పుచు
పరహిత మునుగోరుచుండు వాత్సల్యముతో
సరిరారు గురువుకెవ్వరు
గురుదేవోభవ యనుచును గొలువగ రారే!!!!
ఆటవెలది..
గురుని యొద్ద విద్య కుదురుగ నేర్చిన
జయము లొదవు చుండు జగతి యందు
గురియె గలుగు గాన గురు బోధనములందు
మార్గదర్శకుడగు మంచి గురువు!!!

కందము..
గురుపూజోత్సవ దినమున
గురుదేవో భవ యనుచును కూరిమితోడన్
గురువులను గౌరవించుట
గురుతర భాద్యతగ నెఱిగి గొలువుము పాఠీ!!!


తేటగీతి...
మంచి మార్గము జూపెడు మార్గదర్శి
జ్ఞాన భోధన జేయు విజ్ఞాన వేత్త
మట్టి ముద్దను ప్రతిమగ మార్చు శిల్పి
బహు ముఖమ్ముల ప్రతిభతో బరగు యొజ్జ
నట్టి బుధులకు భక్తితో నంజలింతు!!!


మల్లెపూవు (ఖండిక)




                                                                      మల్లెపూవు

ఉత్సాహ..

చల్ల నైన రూపమున్న చక్కనైన మల్లికా
వెల్లి విరియు నీదు తావి విశ్వమందుహాయిగా
మల్లె పూల మాలలన్న మాత దుర్గ మెచ్చునే
మల్లికేశు డాదరించు మల్లె జన్మ ధన్యమే!!!

 కందము..

తెల్లని మల్లెల తావియె
యుల్లము రంజింపజేయు నుర్వీతలమున్
చల్లని వెన్నెల రేయిని
మెల్లిగ  విడు మల్లెలన్న మెచ్చరె జనముల్!!!

ఆటవెలది....

చక్కనైన సొగసు చల్లని హృదయమ్ము
మత్తు గొలుపు తావి మల్లె సొత్తు
మండు టెండలందు నిండుగా విరబూయు
మల్లె వంటి సుమము మహిని గలదె!!!

ఆటవెలది..

కవుల కలములందు కావ్యనాయకి మల్లె
సరసుల మురిపించు సఖియ మల్లె
మధుర ప్రేమ కొరకు మలిగి పోవును మల్లె
స్వార్థపరత లేని సౌమ్య మల్లె!!!




Monday, September 5, 2016

వినాయకచవితి....




ఏకవింశతి పత్రి పూజ....
సీసపద్యం....

విఘ్ననాయక నిన్ను వేడ్కతోబూజింతు
.........చక్కంగ నిరువది యొక్కపత్రి
మామిడి దానిమ్మ మరువమ్ము గండకీ
...........ఉమ్మెత్త నశ్వద్ధ నుత్తరేణి
మారేడు జిల్లేడు మద్ది జమ్మియు మాచి
........దేవదారు తులసి రావి జాజి
గరిక మునగ విష్ణు క్రాంతయు రేగుయు

..........చిన్న ములక దెచ్చి శ్రీకరముగ
ఆటవెలది....
వెండిపళ్ళెరమున మెండుగా మేలైన
పంచభక్ష్యములిడి భక్తితోడ
దీపములను బెట్టి ధూపహారతులిడి
వేడుకొంటిమయ్య విఘ్నరాజ!!!
కందము...
నిన్నే మనమున దలచుచు
నిన్నే నిరతము గొలిచితి  నిజముగ ణేశా
దన్నువి నీవని నమ్మితి
చెన్నుగ మము గావరావె సింధురవదనా!!!


వందనము విఘ్ననాయక
వందనమిదె పరశుధరుడ పార్వతి తనయా!
వందనము వక్రతుండా
వందనము గణేశ నీకు వందనశతముల్!!!