Sunday, June 26, 2016

పకోడి

పకోడి


కరకర లాడుచు కమ్మగ
కరముల నందముగ నమరి కన్నుల బడుచో
హరుడైన కరగిపోవును
మరచుచు నిజతత్త్వము కద మంచి పకోడీ!


చిరు చిరు జల్లులు చినుకులు
కురియు నెడల నెదుట నీవు ఘుమ్మనుచుండన్
నరులయినను సురలయినను
నురకలనే వేయరొక్కొ? యుల్లిపకోడీ!


పరిమళమిడెడు  పకోడీ !

వరముగ దలతురు నిను దిన వదలరె యెవరున్
సరియగు నుల్లిని చేర్చిన
కరిగెదవే నోటిలోన కమ్మని రుచితో!!!


ఎందుకు పిజ్జా బర్గరు
లెందుకు నూడుల్సు నీవె యెదురగు నెడ నీ
ముందెల్ల తీసికట్టే
విందగుదువు నీవెకాదె? వేడి పకోడీ!





Thursday, June 16, 2016

ఆవకాయపద్యాలు..



జ్యోతి వలభోజు గారి నిర్వహణలో e-book  కొరకు నేను వ్రాసిన ఆవకాయపద్యాలు....


కరివదనా! నిన్ను దలచి!
పరిమళమిడు నావకాయ పద్యము లల్లన్
మురియుచు కలమును బట్టితి
ధరమెచ్చెడి భావములిడి దయతో గనుమా!!!


చక్కనిది యావకాయయె
ముక్కను కొరకంగ చాలు ముక్కంటియు దా
మక్కువతో మరి వదలక
చక్కగ జాడీని బట్టి చను నిజపురికిన్!!!


ముక్కల తో పెట్టగనిది
సొక్కని వారెవ్వరుంద్రు సురభిని జూడన్
పెక్కురు ప్రతిరోజు దినెడు
చక్కని దగు నావకాయ జయజయ జయహో!!!

చక్కని మామిడి కాయలు
ముక్కలు గొట్టించి మురిసి పూనిక తోడన్
ముక్కోటి దేవతలకున్
మ్రొక్కుచు మరి నావకాయ మొదలగు నిండ్లన్ !!!

ఆపదల నాదుకొనునిది
చూపరులకు విందుజేయు చుర్రను దినగా!
తీపిని జేర్చిన బహురుచి
గోపాలుడు మెచ్చెనంట గోముగ దీనిన్!!!

ఎండా కాలము నందున
నిండుగ మన గుండెతాకు నేస్తంబిదియే!
మెండుగ బెట్టుదు రందరు
యండగ తానుండుగాదె యతివల కెపుడున్!!!



కూరిమిగ నావకాయను
నోరారన్ దినని వారు నుర్విని గలరే
యూరిన యూటను జూడగ
సూరియె చవిజూడవచ్చు సుఖముగ నిలకున్!!!



కొమ్మలు వండెడి పప్పున
నిమ్ముగ మరి దోసెలందు నిడ్లీలందున్
గుమ్ముగ పెరుగన్నమునన్
కమ్మగ తా నొదుగు నావ కాయయె సుమ్మా!!!

గారెలు బూరెలు వడలున్
తీరుగ పొంగలి నిజేసి దేవర నీకై
కూరిమిగ నావకాయను
చేరువలో నుంచినారు చేకొనుమయ్యా!!!

ఆంధ్రులకు చెందు సొత్తిది
యాంధ్రమున జనించెనిదియె నధికారముగన్
నాంధ్రమున మాత తానయి
యాంధ్రులకా నావకాయె యాదరువయ్యెన్!!!


ఆవకాయ దినని యాంధ్రుడు లేడయా    
ఆవకాయ లేని యవియె గలదె
ఆవకాయె మనకు నమృత సమానము

ఆవకాయ గాదె నాంధ్రమాత!!!

Wednesday, June 15, 2016

వటపత్రసాయి....

......వటపత్ర సాయి......


బటుతరముగ బొటనవేలు బట్టిన కృష్ణా!
ఘటనము జేయగ జగతిని
వటువుగ నటియించు వృష్ణి వందన మయ్యా!!!

త్రేతాయుగమున వసుధను
యాతనలను బెట్టువారి యత్నము లణచన్
భూతలమున జన్మించిన
సీతాపతి నీవెగాదె చేమోడ్పులయా !!!

ద్వాపర మందున శ్రీకర
గోపాలుడివై సుదతిని గూల్చెడు ఖలులన్
కోపాగ్నిన నుసిజేసిన
తాపస మందార కృష్ణ త్రాతకు జేజే!!!

గోవింద నామ జపమును
గావించిన వారి గావ కలియుగ మందున్
భూవైకుంఠము తిరుపతి
తావున నెలకొన్నవకుళ తనయుడ జేజే!!!


కుక్షిని గల సకలమ్మును
రక్షించగ నీకునీవె రసనే పుడుచున్
దక్షత నిచ్చుచు జగతికి
రక్షక వటపత్రశాయి ప్రణతులు గొనుమా!!!


కుచేలుడు .....



                                                             .....  కుచేలుడు......


విద్య లెన్ని యున్న  బీదతనమ్ముతో
విధిని మార్చలేని  విష్ణు సచియె
భార్య బోధ జేయ బట్టెడు వడ్లను
బెట్ట వెన్ను నోట బుట్టె సిరులు!!!


గుప్పెడు చిపిటము లీయుచు
విప్పగు సిరులన్ గ్రహించు వెన్నుని హితుడా!
గొప్పదయా నీజన్మము
అప్పనముగ వచ్చి బడెను యర్ధంబిలలో!!!

మస్తుగ విద్యలు నేర్చిన
పస్తులతో గడుపు చున్న బాల్యసగంధున్
హస్తముల వడ్లు చవిగొని
శస్తములగు సిరుల నిడెడు సవ్యుడ జేజే!!!


పురుషోత్తమునే హితునిగ
వరముగ మరి బొందినావె బ్రాహ్మణ శ్రేష్ఠా!
ధరలో యింతటి భాగ్యము

నొరులెవ్వరు బొందగలరె యో గుణశీలీ!!!

Tuesday, June 14, 2016

గానకోకిల ..సుశీల




                                                                               .సుశీల.....


విజయనగరపు కోయిల.....



మధురగీతాలతో పదునాల్గు భువనాల

............పరిమళములు నింపు పైడిబొమ్మ

నవరసమ్ములొలుక నద్భుత రీతిలో


..............గొంతెత్తి పాడిన కోకిలమ్మ


భాష యేదయినను బహుభక్తి తోబాడి


వేల పాటలు బాడి వేదికలలరించు


.........గానకోకిల నిను గడన దరమె!




విజయనగరమందు విరిసిన కోయిల


సాటిగలరె నీకు జగతి లోన

సురుచిరమధు దార సుస్వరాల సుశీల

అందుకొనుమ తల్లి వందనములు!!!