Wednesday, April 2, 2014

పద్య రచన -549 ( క్షీరసాగర మధనం)


 శ్రీ కంది శంకరయ్య  గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...

 

అమరు లసురులు చిలుక క్షీరాంబునిధిని
వచ్చు హాలహలము గని భయమునొంద
గరళ మంతయునున్ ద్రావి గళమునందు
నిలిపి పెనుముప్పు దప్పించె నీలగళుడు 


 ప్రధమంగా నేను వ్రాసిన ఖండిక యిది..  ఇదంతా గురువులైన శ్రీ శంకరయ్యగురువుగారు, శ్రీ నేమాని గురువుగార్ల ఆశీర్వాద బలం, ప్రోత్సాహం.... వారికి సదా కృతజ్ఞతాభివందనములతో...


                                                          క్షీరసాగరమధనం 

   ఖండిక......                                                  

మంధరగిరి కవ్వముగను
బంధముగయాదిశేషు బట్టగ గిరి నా
నంధువుగహరికమఠమై

సింధువు మధనమ్ము జేయ చెలువము తోడన్

పొందుగ సురలును దనుజులు
నందముగాకడలిచిలుక నానందముతో
బొందిన హాలాహలమున్
ముందుగ పుక్కిటనుబట్టె మృత్యుంజయుడే

మ్రింగెనుగద పరమశివుడు
పొంగిన గరళమ్ముతాను పుక్కిట నిడుచున్
హంగుగ గళమున బెట్టిన
జంగమదేవర నుగనగ జయజయ మనుచున్

హరిహరులను గొలిచిజనులు
మరలన్ మధనమ్ముజేయ మంధర గిరితో
సురభియు నైరావతమును
సిరియును కల్పకము శశియు చెన్నుగ వచ్చెన్

ధరియించెను శశిని శివుడు
వరియించెను సిరిని శౌరి వాత్యల్యమునన్
తరలెను సురపతి వెంబడి
సురభియు నైరావతమును సొగసుగ దివికిన్

వందనము నీలగళునకు
మందరగిరిధారి హరికి మధుసూదనకున్
వందనము సిరికి, శేషుకు
వందనమాచార్యులకును వందన మెపుడున్



No comments:

Post a Comment