Sunday, April 20, 2014

సమస్యా పూరణ...( ముండన్ జేరిన నరునకు పుణ్యము గలుగున్ 1375)

శ్రీ కంది శంకరయ్య గురువుగారకి కృతజ్ఞతాభివందనములతో....





కొండల రాయని దలచుచు
మెండుగ పూజించుచుండ మేలౌ నిలలో
వెండియు శివవల్లభ చా
ముండన్ జేరిన నరునకు పుణ్యము గలుగున్

Wednesday, April 9, 2014

పద్య రచన..559


శ్రీ కంది శంకరయ్య  గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...







పుట్టు చున్న దెల్ల గిట్టుచు నుండును
గిట్టు చున్న దెల్ల బుట్టు చుండు
పుట్టి గిట్టు లోని పోకడ లేమిటో
ఎరుక గలుగు వారు ధరను గలరె?




కర్మతోనె బుట్టి కర్మతో బెరుగుచు
కర్మ ఫలము నందె నర్మిలిచ్చి
కర్మ యందు లయము గలిగించు కాలుడే
కర్మ జన్మ గాదె కాశి నాధ

సమస్యా పూరణ..1374 (మగవానికి, గర్బమయ్యె మానిని గూడన్)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..





తగ దైవగతింబొనరెన్
మగవానికి, గర్బమయ్యె మానిని గూడన్
సుగుణాలరాశి భార్యకు
సొగసైన సుతుడు జనించి సుఖమున్ నొసగెన్

పద్య రచన..558 -(ఏడుస్తున్న పాప)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....






పాలు గాఱెడు చిన్నారి పాప యొకతి
ఏడ్చు చుండెను తన బుగ్గలెఱ్ఱ బడగ
కనుల జారెను నీలాలు కలవరమున
ఏమి కారణ మేమియో యెవ్వ రెరుగు?


Tuesday, April 8, 2014

శ్రీరామ నవమి శుభాకాంక్షలు....

              ... అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు...
                  శ్రీరాముడు...మంచి బాలుడు ..ఒకటే మాట, ఒకటే భాణం..., ఒకటే పత్ని...అన్నదమ్ముల మీద   అలవికాని   మమతానురాగాలు, గురువులపై భక్తి, తండ్రి మాట జవదాటని సుతుడతడు...శత్రువునైనా మన్నించే గుణం,మిత్రులపై ప్రేమ...జంతువులపైన కరుణ...దర్మం తప్పని పరిపాలన...వెరసి..రామరాజ్యం...
                  ఇన్ని గుణములు  ..ఎవరికైనా సాధ్యమా..సకలగుణాబి రాముడు..శ్రీరాముడు..అందుకే అందరికీ ఆదర్శప్రాయుడు...అతనికి అన్నింటా తగిన దే మన సీతమ్మ తల్లి...
                    ప్రతీ ఉూరూ వాడా ,శోభాయమానంగా జరుపుకునే పండగ రామ నవమి...ఉదయాన్నే రామరసం(పానకం) తయారు చేసి, వడపప్పుబెల్లంతో  సీతాపతికి నివేదన చేసి , పూజ అయిన తర్వాత ఎంతో ఇష్టంగా అందరూ ఆ రామరసం సేవిస్తారు..తర్వాత గుడిలో జరిగే రామ కల్యాణం భక్తి శ్రధ్ధలతో చూసి తరిస్తారు..

           రామ, రామ,రామ యన్నచాలు అదే తారక మంత్రం...ఆ మంత్రానికున్న మహిమ అపారం... ప్రతి దేశం.ప్రతి రాష్ట్రం,.ప్రతి ఊరు, రామరాజ్యం కావాలని, ప్రతీ ఇంట్లో రాముని వంటి సుతులు వుండాలని ఆకాంక్షిస్తూ....
ఆ శ్రీరాముని  దయ అందరిపై  సదా వెల్లివిరియాలని కోరుతూ....జై శ్రీరామ్.....







Sunday, April 6, 2014

పద్య రచన..557 -(ముదితల్ నేర్వగరాని విద్యగలదే )


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...







మగువలు నేర్వని విద్యలు
జగమున లేవనుట నిజము చక్కగ నేర్పన్
మగవారికి చేదోడుగ
సగభాగము తామగుదురు సాధ్వీ మణులే!


సంగరమందున నురుకును
నింగిని సైతము వెలుగును, నిప్పుల నార్పున్
శృంగము లెక్కును చివరకు
మంగలిపని నేర్వగలరు మహిళా మణులే

సమస్యా పూరణ..1373 - (మార్జాలము సింహమయ్యె మర్మంబేమో!)


 శ్రీ  కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....


అర్జును నింటను పెరిగిన
మార్జాలము సింహమయ్యె మర్మంబేమో!
ఖర్జువు కుట్టిన దేమో!
గర్జించుచుసింహమువలె గడపను దాటెన్

సమస్యా పూరణ..1372 ( సతిని, జంపె రామచంద్రమూర్తి)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....



రక్కసు చెరనుండి రక్షించు కొనుటకు
సతిని, జంపె రామచంద్రమూర్తి
లంక నేలు నృపతి రావణ బ్రహ్మను
లక్షణముగ కుజకు రక్ష జెేసె

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...








 ఉత్సాహ......


ముందు జన్మ సచివు లనుచు ముదముతోడ నాడుచున్
వంద నీయుడగు హనుమను వానరముల వెదుకుచున్
చిందు లేయు చుండెనుగద చిన్ని కృష్ణుడన్నతో
విందు గాను చూచు చుండె వెనుక నుండి తల్లియే

Friday, April 4, 2014

పద్య రచన ..555 ( పొగత్రాగుట)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...









 భుగభుగమని పొగ వదలుచు
సిగరెట్టును ద్రాగుచున్న సిరితా పోవున్
పొగద్రాగుట హానికరము
పొగద్రాగుట మానుకున్న పొందును సుఖమున్

Thursday, April 3, 2014

సమస్యా పూరణ..1370 (నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...




చుట్టముల కొత్త యింటను
పెట్టెిరి రేడియముశశిని ప్రీతిగ తారల్
తట్టిన మేధకు జోతల్
నట్టింట దళుక్కుమనెను నక్షత్రములే

పద్య రచన..553 (పరీక్షిత్తు)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృజ్ఞతాభివందనములతో...





 

దాహ మడుగగ బలుకని తపసి పైన
సార్వబౌముడు పడవైచె సమయునహిని
శాప మొందిపరీక్షిత్తు జనెను తుదకు
ప్రభువు నైనను వీడునా పాప ఫలము

సమస్యా పూరణ..1369 (నీతి పరుని మాట నీటి మూట)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...



గట్టి మేలు జేయ గద్దెనెక్కునెవరు?
దోచు కొనుట కదియె దొంగ దారి
దేశ ప్రజల దోచి దేవుళ్ళమను నవి
నీతి పరుని మాట నీటి మూట

పద్య రచన ..553 ( మామిడి పళ్ళు)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....







మామిడి పండ్లను జూడగ
ప్రేమను నోరూరి కొనగ వేగిర పడగా
నేమని చెప్పుదు రామా?
క్షేమంబగు ధరలు గలవె సేవింపంగన్ 




వాసి కెక్కిన పండ్లను రాశి పోసి
జూడ చక్కగ బేర్చెను జూపు లలర
పండ్లు జూడగ బంగిన పల్లి యగును
మండు వేసవి మరపించు మావి పండ్లు

జయ ఉగాది కవిత...


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....

  
జయ జయ జయవత్సరమా!
జయములనీయుము జగతికి జాగృతి తోడన్
జయమనె కోకిల రవములు
జయమంచు పలికె నుగాది జయ జయ జయహే!

పద్య రచన ..552 ( ఉగాది పచ్చడి)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...







తెల్లని మల్లెల నవ్వులు
పుల్లని మామిళ్ళు జూడ పులకరమొందన్
యెల్లరకు జయములీయగ
యుల్లము రంజిలగనేడు యుగాది వచ్చెన్

సమస్యా పూరణ ..1368 ( గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాబివందనములతో...





మతి మాలిన చేతలతో
గతుకుల బడద్రోసిపోయె గతకాలంబే
చితికిన యతుకుల బ్రతుకుల
గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ



వెతికిన లేదే శాంతియు
పతనము వైపే పరుగులు భారతదేశం

బతలా కుతలము జేసిన
గతకాలము కంటె వచ్చు కాలము మేలౌ

పద్య రచన 551 - ( విజయకు వీడుకోలు)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...






అజరామరమగు శుభములు
నిజముగ నందించలేక నిందలు పడుచున్
విజయయె వెడలుచు నుండెన్
విజయా! వీడ్కోలు నీకు వినయము తోడన్

సమస్యా పూరణ..1366 (మల్లియతీవియకు, గాచె మామిడి కాయల్)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....




మల్లెలు పూచెను ఘుమ్మని
మల్లియతీవియకు, గాచె మామిడి కాయల్
కొల్లలుగతోట లందున
నుల్లంబులు సంతసిల్ల నూరించెనుగా

పద్య రచన -550

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...








తెల్లని తురగమునుగనగ
చల్లగ వారాశిదరిన చక్కగ నుండెన్
అల్లది కల్కికి జెందిన
తెల్లని జవనాశ్వ మనుచు తెలిసెనిపుడహో!

చమత్కార పద్యము

క్రింది పద్యంలోని చమత్కార మేమిటి?

కం.
ఏమీనన తా బేలన
నా ముంగిటి కేల రాడు నరహరి పిన్నా
రాముల ముమ్మా రంపిన
ప్రేమను మరి బుద్ధి చెప్పి పిలువవె కలికీ!


(ఏమీ అనను. తాను బేలవాఁడు. నా ముందరకు ఎందుకు రాడు? ఆ నరహరి పిన్నవాఁడు. రాములును ముమ్మారులు పంపించాను. నీవైనా బుద్ధి చెప్పి పిలువవే. కలికీ!)
 
 
సమాధానం....
 
ఈ పద్యంలో దశావతారాలు పేర్కొనబడ్డాయి.
మీన (మత్స్య), తాబేలు (కూర్మ), కిటి (వరాహ), నరహరి (నృసింహ), పిన్న (వామన), రాములు (పరశురాముఁడు, శ్రీరాముఁడు, బలరాముడు), బుద్ధి (బుద్ధ), కలికి (కల్కి). 

సమస్యా పూరణ ..1365 (నాలు గైదులు పదునారు నలిన నయన!)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...




లెక్క లందున చిక్కులు పెక్కు కలవు
పంచ వలయురెండైదులు ప్రాకటముగ
నైదు తో,వచ్చు ఫలమున కైదు కూడ
నాలు గైదులు పదునారు నలిన నయన!

నా భావము.(.55/5)+5=16


Wednesday, April 2, 2014

పద్య రచన -549 ( క్షీరసాగర మధనం)


 శ్రీ కంది శంకరయ్య  గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...

 

అమరు లసురులు చిలుక క్షీరాంబునిధిని
వచ్చు హాలహలము గని భయమునొంద
గరళ మంతయునున్ ద్రావి గళమునందు
నిలిపి పెనుముప్పు దప్పించె నీలగళుడు 


 ప్రధమంగా నేను వ్రాసిన ఖండిక యిది..  ఇదంతా గురువులైన శ్రీ శంకరయ్యగురువుగారు, శ్రీ నేమాని గురువుగార్ల ఆశీర్వాద బలం, ప్రోత్సాహం.... వారికి సదా కృతజ్ఞతాభివందనములతో...


                                                          క్షీరసాగరమధనం 

   ఖండిక......                                                  

మంధరగిరి కవ్వముగను
బంధముగయాదిశేషు బట్టగ గిరి నా
నంధువుగహరికమఠమై

సింధువు మధనమ్ము జేయ చెలువము తోడన్

పొందుగ సురలును దనుజులు
నందముగాకడలిచిలుక నానందముతో
బొందిన హాలాహలమున్
ముందుగ పుక్కిటనుబట్టె మృత్యుంజయుడే

మ్రింగెనుగద పరమశివుడు
పొంగిన గరళమ్ముతాను పుక్కిట నిడుచున్
హంగుగ గళమున బెట్టిన
జంగమదేవర నుగనగ జయజయ మనుచున్

హరిహరులను గొలిచిజనులు
మరలన్ మధనమ్ముజేయ మంధర గిరితో
సురభియు నైరావతమును
సిరియును కల్పకము శశియు చెన్నుగ వచ్చెన్

ధరియించెను శశిని శివుడు
వరియించెను సిరిని శౌరి వాత్యల్యమునన్
తరలెను సురపతి వెంబడి
సురభియు నైరావతమును సొగసుగ దివికిన్

వందనము నీలగళునకు
మందరగిరిధారి హరికి మధుసూదనకున్
వందనము సిరికి, శేషుకు
వందనమాచార్యులకును వందన మెపుడున్



సమస్యా పూరణ..1364 (బధ్ధ కించు వాడె , భాగ్య శాలి)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి   కృతజ్ఞతాభివందనములతో...



కష్టపడకయున్న కడుమందుడగును
బధ్ధ కించు వాడె , భాగ్య శాలి
యగును బద్దకమును దిగవైచినంతనె
జయము బడయు నెపుడు జగతి లోన

పద్య రచన...548 ( త్రిశంకుస్వర్గం)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....





మునివరుడా గాధిసుతుడు
ననువుగ సృజియించెనాడు నద్భుత రీతిన్
ఘనముగ త్రిశంకు కోసము
వినువీధిన సృష్టి జేసె వేరొక దివినే



నేతల మాటలు వినగా
గోతిన్ బడద్రోయనేమొ గొప్పగ జనులన్
భూతల త్రిశంకు దివియిది
ఏతావాతా నరయగ నేమగు నేమో!

ప్రహేళిక -52

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....

 ఫ్రహేళిక ...- 52




తండ్రికొడుకు లొక్క తరుణిని రమియింప
పుత్రు లిద్ద రొంది పోరు గలుగ
నొకని జంపి రాజ్య మొకని కిచ్చిన ప్రభు
వాతఁ డిచ్చు మనకు నఖిల సిరులు. 



సమాధానం...

 తండ్రి కొడుకులైన తరణి యముల చేత
కర్ణ ధర్మజులను గనెను కుంతి
సమరమందు కర్ణుఁ జంపించి ధర్మజు
నవనిపతిగఁ జేసె హరియె గాదె.

సమస్యా పూరణ..1363 (గరళ కంఠుని బూజింప,గరళ మిచ్చు)


శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...

 

చిత్త శాంతిని గల్గించి చింత దీర్చు
గరళ కంఠుని బూజింప,గరళ మిచ్చు
ననుచు గేలిడు వారిని గనుచు మురియు
భక్త వరదుడౌ శూలికి వందనములు

పద్య రచన ..-547 ) ఉపాధ్యాయుడు)

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి, కృతజ్ఞతాభివందనములతో....








నిరతము విద్యను నేర్పుచు
పరహిత మునుగోరుచుండు వాత్సల్యముతో
సరిరారు గురువుకెవ్వరు
గురుదేవోభవ యనుచును గొలువగ రారే!




మంచి మార్గము జూపెడు మార్గదర్శి
జ్ఞాన భోధన జేయు విజ్ఞాన వేత్త
మట్టి ముద్దను ప్రతిమగ మార్చు శిల్పి
బహు ముఖమ్ముల ప్రతిభతో బరగు యొజ్జ
నట్టి బుధులకు భక్తితో నంజలింతు

Tuesday, April 1, 2014

పద్య రచన ..546 ( తోటకూర)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...








ఆకు కూరల నన్నింట ప్రాకటముగ
తోట కూరయె వసుధలో మేటి దనగ
పప్పువండగ కూరతో పరమ రుచియు
కరకర పకోడి జేసెడి కూర ఘనము




తోటన పెరిగిన కూరను
వాటముగా కోసి కడిగి వండగ పులుసున్
నోటిన నీరే యూరగ
తోటాకుల కూటు తినగ ధూర్ఝటి వచ్చున్ 

సమస్యా పూరమ.. 1361 ( జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...



జందెము జీర్ణము కాగా
జందెము విడనాడువాడె సద్బ్రాహ్మణుడౌ
అందముగా లేదనుచును
జందెము విడనాడువాని జడుడన వచ్చున్

పద్యరచన -545 (మతసహనం)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...



 



పౌరు లంద రెపుడు పరమత సహనమ్ము
కలిగి యున్న మహిని గలుగు జయము
ముస్లిమైన గాని పూజించి రాముని
దైవ మొక్కడనుచు భావ మిడెను



 

రాముని గని యల్లా యని
ప్రేమముతో బూజ చేసిరి చెలియలు కదా
నామము రూపము మారిన
రాముడు జీససు రహీము లా రక్షకుడే

సమస్యా పూరణ..1360 -(గీతా పారాయణమ్ము, గీడొనరించున్)


 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో,,,


 
నీతియు నియమము నేర్పును
గీతా పారాయణమ్ము, గీడొనరించున్
ఖాతాలో నల్లధనము
గోతాములసంపదున్న గొడవలు దెచ్చున్

పద్య రచన ..544 - (చదువుచున్నవనిత)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...








 
చంద మామ మోము చారెడేసికనులు
నినుడు తిలక మాయె నింతి నొసట
సిగను మల్లె మాల చేతిలో పొత్తము
పట్టు చీర గట్టె పైడి బొమ్మ

సమస్యా పూరణ.. 1359 (కామితార్ధముల్ సిద్ధించు, లేమి వలన)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో..


సత్య పధమున సాగెడు సర్వులకును
కామితార్ధముల్ సిద్ధించు, లేమి వలన
కలతలవలలో జిక్కును కాపురములు
చిత్త మందున హరినామ చింత యున్న
వెతలు దీరును మనుజుల బ్రతుకు మారు

పద్య రచన ..542 ( నాణెములు)

 శ్రీ కంది శంకరయ్య గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో....








యెల్లరి మన్నన బొందిన
చిల్లర నాణెమ్ములన్ని చేరెను మూలన్
చిల్లర సిరిమాలచ్చిమి
చెల్లక పోయిననునేడు చేయరె జోతల్

పద్య రచన...543 (వెన్న దొంగ )

శ్రీ కంది శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని గురువుగారికి కృతజ్ఞతాభివందనములతో...







మెల్లగ వెన్నను మ్రుచ్చిల
నల్లని కన్నయ్యజేరి నటనము లాడెన్
అల్లన చట్టిని వాలిచి
చల్లగ వెన్నంత గ్రోలు చక్రికి జోతల్ 



 
అన్న రాముని తోడుగ వెన్న దొంగ
వెన్న మ్రుచ్చిల జేయచు వేడ్క నొందె
వన్నెచిన్నెల మోమున నెన్ని హొయలు
చిన్ని కృష్ణయ్య నీలీల లెన్న తరమె