Saturday, June 29, 2013

శంకరా..అభయంకరా....



పత్తి నీవె , వత్తి నీవె
విత్తు మేసే ఆపత్తు నీవె
కుత్తుకలో అనురక్తి నీవె
జిత్తులమారి, శక్తివినీవె

ముచ్చటగొలిపే మూడవకన్ను
ముచ్చెమటలు పట్టించెనయా
విచ్చుకుతిరిగే విషసర్పాలే
విచ్చుకత్తిలా మారెనయా
అచ్చట శూలపుభీషణకేళికి
కచ్చిక నేల రాలెనయా
పచ్చికైనను మొలవదయా
పిచ్చుకలపైబ్రహ్మాస్త్రమేలయా

హంగులు లేని లింగమూర్తివి
కొంగజపాలకు లొంగని సామివి
మింగుడుపడనీ ఎంగిలయినదా
జంగమదేవర గంగనొదిలితివి...
  
పాపాలే పెరిగినవో భువిని
శాపాలే తగిలినవో ఎవని
రూపాలే మరిగినవో జనని
కోపాలకు గురిఅయినదే అవని

Tuesday, June 25, 2013

పద్యం --హృద్యం..



పద్యాలంటే అందరికీ ఠక్కున గర్తు వచ్చేవి ..వేమన పద్యాలు..
బాల్యంనుండీ ..ఆడుతూ ,.పాడుతూ, అలవోకగా నేర్చుకున్న పద్యాలవడం వల్లనేమో అవంటే నాకు చాలా ప్రీతి...
వేమన ఆశుకవి..ఆయన పద్యాలు ..తన శిష్యుల చెవుల్లోకి,..అక్కడినుండి తాటాకుల్లోకి ప్రవహించాయని అంటారు..
వేమన ప్రజాకవి,..ఆటవెలదితో అందమైన కవిత్వం, విలువలతో కూడిన సలహాలు..అతని పద్యాల సొత్తు..పండిత,పామర జనరంజకంగా పద్యాలల్లుట ఒక్క వేమనకే స్వంతం...
ఈ మద్యనే ..చందోభాషణ (fb page) చూడటం జరిగింది...ఎంతమంది కవులు ..తమ కలాలను కరవాలాల్ల ఝడిపిస్తున్నారు..పదాలతో చదరంగం ..ప్రాసలతో పరవశం కల్గిస్తున్న ఎందరో మహానుభావులు ...
ఆ పద్యాల పూలతోటలో విహరించి , .ఆ సువాసలను ఆఘ్రాణించిన మీదట పద్యం వ్రాయాలనే కోరిక మళ్ళీ తలెత్తింది...
మళ్ళీ అని ఎందుకన్నానంటే ..గతంలో కొన్ని వ్రాశాను..అయితే నావి చందోబద్దమైన పద్యాలు కావు..భావాలను పద్యంగా మలచడానికి నే చేసిన చిన్న ప్రయత్నం...
  
ఆశుకవిత్వం పలికే కవులున్న ఈ ఇలని
 ప్రాస వచ్చినగాని.... ప్రతివారు కవులవునా
               ఆశ పడినగాని ..........ఆకాసమందునా
                సీసపద్యమెట్లు...........శ్రీనివాసా

చిత్తమున స్మరియించి తల్లిని
విత్తును మనమున నాటితిని
చిత్తం..ఆదేవి కృపా, జలధారలనడిగితిని
పుత్తడి పదపంటకోరి ,చేరా,భారతి,చెంతని..


                      నీది నాది అంటేనే వాదు
                      మనది అన్నమాటే చేదు
                      ఏదినీది,..ఏదీ మనది
                      ఎంచి చూడ ఏదియు లేదు

ఒకరా..ఇద్దరా...సంఖ్యకు అందని కవులెందరెందరో...
చకచకమని కందంతో  పందెమువేయునదెందరో..
లకలకయని ఆటవెలది ...ఆడింతురింకెందరో...
రకరకముల సీసము సువాసనల  తేలించునదెందరో..
ఒకరు ,..కాదు ప్రతి ఒకరికి ..వందనమన్నది డెందము.
సకలకళా ప్రవీణులకు..సాహిత్యపు సర్వులకు....




Monday, June 24, 2013

శ్రీశైలశిఖరం దృష్ట్వా .... పునర్జన్మ నవిద్యతే...

ద్వాదశ జ్యోతర్లింగాలు, అష్ఠాదశ శక్తి పీఠాలలో శ్రీశైలం ప్రత్యేకమైనది.  కారణం అమ్మవారు భ్రమరాంబా దేవి రూపంలో మల్లిఖార్జునుని ఆలయం పైభాగంలో కొలువై ఉంటారు.
అంతేకాక జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే ప్రదేశంలో కొలువై ఉండటం కూడా.
కొత్త ప్రదేశాలు చూడడమంటే అందరిలాగే నాకూ మహా ఇష్టం.

హైదరాబాదునుండీ కారులో.. ప్రయాణం ఒక మధురానుభూతి.. శంశాబాద్ ఎయిర్పోర్టు కు 40 కి.మీ. దాటగానే శ్రీశైలం బోర్డు దర్శనమిచ్చి, మనం సరైనదారిలో ప్రయాణిస్తున్నామన్న భరోసా కలగచేస్తుంది.
మరో 45 కి.మీ. వెశుతూనే మన్ననూరు చెక్పోస్టు వస్తుంది.  అక్కడే ఫారెస్టు గెస్టు హౌసుకూడా వుంది.  రాత్రి అడవిలోకి ప్రవేశం నిషిద్దం. రాత్రి అయిపోయి ప్రయాణం వీలులేనప్పుడు అక్కడ బస చేయ వచ్చు.


ఇక అక్కడనుండి ...నల్లమల అడవులు ప్రారంభమవుతాయి.....ఎటుచూసినా పచ్చని ప్రకృతికాంత... ఆకుపచ్చని చీరలో అందంగా ముస్తాబైనట్లుంటుంది...అలా  అలా ..సాగే పయనంలో ....ఠీవిగా అల్లుకుపోయి,..సుశిక్షతులైన సైనికుల్లా దారికి రెండువైపులా ఏపుగా పెరిగిన వెదురు వనాలు..టేక్ కేర్ అని చెప్తుంటాయి...
మార్గమధ్యలో రిజర్వుపారెస్టువారి ..టైగర్జోన్  హెచ్చరికలతో పెద్ద, పెద్ద హోర్డింగ్స్...ఎదురయ్యే జంతువులకి ఏమీఫీడ్ చేయొద్దన్న బోర్డులు అడుగుగున కన్పిస్తునే వుంటాయి... ...అతి ప్రశాంత వాతావరణం...వృక్షరాజాలు చేసే సంగీత స్వరాలు తప్ప మరే రొదలూలేని నిశ్శబ్దం...అప్పుడపుడూ ఎదురయ్యే వాహనాలు..అలాగే ...ఆగాలనిపించే చిన్న, చిన్న, కేంటీన్లు...దట్టమైన వృక్షాల సముదాయం..టైగర్స్ జోన్ దగ్గర టికెట్స్ తీసుకుని టైగర్స్ ని చూడవచ్చు....
అన్నిటినీ మించి అమితంగా.. అందరినీ ఆకట్టుకునేవి..అవే..మన నేస్తాలు..చుట్టాలు..మానవుడి మూలాలు..ఏవంటారా...
వానర సమూహాలు..దారి పొడవునా తమ కుటుంబాలతో హాయిగా , స్వేచ్చగా, ఆడుకుంటూ,..వచ్చే వాహనాల దగ్గరికి అడ్డువస్తూ,..ఆగితే చాలు..సకుటుంబ సపరివార సమేతంగా ..మన దగ్గరకి వచ్చి ..వాటి చేష్టలతో ఏవైనా పెట్టమని అడుగుతుంటాయి...

ఇంతమంది చుట్టాలు ఎదురవుతారని తెలియని నేను కించిత్ భాధపడ్డాను ..ఏవీ తేనందుకు,,అప్పుడు గుర్తొచ్చింది..మంచి ముఖిరీ అరటిపళ్లు వున్న సంగతి...అవి తీసి వాటిని సగం,కట్ చేసి, ఆగినపుడల్లా దగ్గరకు వచ్చిన వాటికి అందించాను...ఎంత బాగా చేత్తో అందుకుని ...తీరిగ్గా చెట్లదగ్గరకి వెళ్లి తిన్నాయి...
వాటి హావభావాలు దగ్గరనుండి చూస్తూంటే చాలా గమ్మత్తుగా అన్పించింది...వెంటనే వాటిని నా కెమేరాలో బందించాను...
ఎగిరే మయూరాలు..పక్షుల కువకువలు..జింకలపరుగులు    .గాలి చేసే ధ్వనులు...వింటూ,..నల్లమల అడవుల అందాలను ఆస్వాదిస్తూండగా ..నాగార్జునసాగర్ డేమ్ వచ్చింది ..అక్కడ దిగి తనివితీరా సాగర్ని చూసి పులకించి పోయాం...చిన్నప్పటి క్లాస్ పుస్తకాలలో చదువుకున్న నాగార్జునసాగర్ ని ఎదురుగా చూస్తూవుంటే చెప్పలేని ఆనందం కల్గింది.

..ఆ ఆనందాన్ని మననం చేసుకుంటూ ...వుండగానే వచ్చేసింది శ్రీశైలం...
ముందుగా సాక్షిగణపతి దేవాలయం వస్తుంది.. అక్కడ చేతిలో పుస్తకం కలం, ధరియించి సుందరరూపంతో కొలువైన గణపతిని సేవించి . మన గోత్రనామాలు చెప్పాలి..అవి గణపతి వ్రాసుకుంటారట...శ్రీశైలం చూడటానికి వచ్చేవారు ....వచ్చేటపుడు,..., తిరిగి వెళ్ళేటపుడు ,...సాక్షిగణపతికి చెప్పి వెళ్తారు...


మల్లికార్జునస్వామి , భ్రమారాంబల దర్శనం అలౌకిక ఆనందాన్ని ఇచ్చింది..అక్కడికి కొంచం దూరంలో వున్న శ్రీశైల శిఖర దర్శనం కొంచం కష్టం కలిగించింది..ఎందుకంటే ..మేము వెళ్ళినది వేసవి ఎండలలో.. ఎక్కువ భాగం చెప్పులు లేకుండా నడవాలి.. ..శిఖరం చూడడానికి చాలా మెట్లు ఎక్కాలి ..అదే ఉదయంగానీ ,..సాయంకాలం కానీ అయితే  సమస్యలేదు...

అయినా ఆ మాత్రం కష్టం లేకుండా ఆ శక్తిస్వరూపాలని చూడలనుకోవడం... సాధ్యమా...అయినా కష్టే ఫలి అంటారుగా...

శ్రీశైలం నుంచి తిరిగి వస్తునపుడు మళ్ళీ సాక్షి గణపతిని దర్శించి..స్వామిని , దేవేరిని చూసి వెళ్తున్నాం...అందుకు నువ్వే సాక్షి ..అని ఆలయంలో గణపతికి విన్నవించి రావాలిట...మేము అలాగే సాక్షిగణపతికి చెప్పి ...అలవికాని ఆత్మానందంతో ,శ్రీశైల మల్లన్నకి మరోమారు నమస్కరించి .....హైవే ఎక్కాం...

Thursday, June 20, 2013

గంగా "వతరణం"


నా మనసే ఉప్పొంగే నిను చూడంగా
నడయాడే కళ్ళెదుటే పావనగంగా..
పాపాలను శాపాలను కడిగేయంగా
పరవళ్ళుతొక్కుతూ ప్రవహించెవేగంగా...”.

6 నెలలక్రితం గంగానదిని చూసినపుడు ,కన్నులపండువగా గంగాహారతి ని ఆతల్లి ఒడి లో 2 గంటలుకూర్చుని చూస్తున్నప్పుడు నాలో కలిగిన భావావేశం పాటగా ఉరికింది అదే  ఈ పాట ..పల్లవి..

నేటి ఛార్ ధామ్ యాత్రా విశేషాలు వింటుంటే..చూస్తూంటే....వేదన....అలవికాని రోదన....

       శివుని జటాజూటం జడలముడి వీడెనా... లేక   .....గంగా ఆగ్రహమా...
ఆనాడు ..భగీరధుని మనోరధం ఈడేర్చడానికి ..వున్మత్తమానసవిహంగయై..చెంగు, చెంగుమని దూకుచూ ,చెలరేగిపోవుచూ..అలా సాగుచూ,చెలరేగుచున్న గంగను తన శిఖలోబంధించినాడు  ఆ పరమశివుడు...తన జాడ ఎరుగని గంగ వడిగా వడివడిగా వెళ్తూ జహ్నుముని ఆశ్రమాన్ని ముంచివేసినదిట...
  
ఈనాడు..సాక్షాత్తు శివనివాసమైన ఆ పుణ్యస్థలాలను, ..25 అడుగుల ఎత్తున్న శివమూర్తిని సైతం..తన ఉత్తుంగ తరంగ వేగంతో ముంచివేసి ..వేలకొలదీ జనాలను, జనా వాసాలను,  తనలో కలుపుకుని , భయభ్రాంతులను చేస్తున్న  ఆ తల్లిని ఆపగలిగే నాధుడెవ్వరు..

ఏ భగీరధుడు పిలిచాడని ....?  ఇంత ఉగ్రరూపంతో..నీతోపాటు, నీసోదరిలను కూడా వెంటనిడుకుని వచ్చావు తల్లీ..
ఇది కలియుగం..నీ ధాటిని ఆపగలిగే ఆ మహేశ్వరుడు గాని, ఆ జహ్నుముని లాంటి మునులు రాని, రాలేని కాలమిది..ఇకనైనా నీ ఆగ్రహాన్ని చాలించి ..
వడివడి, త్వరపడి, వురవడి, సడివిడి...
భువిపై జాలిపడి..
కరుణరస మూరంగ..కల్యాణగంగవై..
కడగండ్లు ఇకచాలు ....కరుణించు వే” “గంగ..

Tuesday, June 18, 2013

నాకు ఇష్టమైన భానుమతిగారి పాట...






                         తోడు - నీడ సినిమాలో భానుమతిగారు అద్భుతంగా పాడిన ఇంగ్లీషుపాట , దాని ఒరిజనల్ పాట..
                   సంగీతప్రియుల మనసులను మల్లెలమాలలూగించిన ఎన్నో పాటల్లో ఇది ఒకటి..

                           దులపర బుల్లోడా ..దుమ్ముదులపర బుల్లోడా..అని ఓ దుమ్ము దులిపినా,..అమ్మాయిలు..అబ్బాయిలు .నా మాటలో నిజం విటారా మీరు ..అని నేటి ఆధునిక పోకడల తీరుతెన్నుల పై తన ఒక్కరికే స్వంతమైన విలక్షణ గాత్రంతో సందేశాన్నిచ్చినా ..అది భానుమతిగారికే చెల్లు..
ఎన్ని గమకాలు,..ఎన్ని హొయలు...ఆ గానవాహినిలో ..మైమరచి మంత్రముగ్ధులవని వారు వుండరంటే అది అతిశయేక్తి కాదు...

Friday, June 14, 2013

మార్పు...The Change..

      



 మార్పు దేనికైనా సహజం.అని తెలిసినా కూడా స్పందించుట హృదయ లక్షణం..కాల మాయాజాలంలో కనుమరుగవుతున్నవి ఎన్నో..
        కనుమరుగై చాలా కాలమైనా ....కొత్తగా ..దాని సేవలను  అసాంతం ఆపేస్తున్నారు పోస్టల్ శాఖవారు...పోస్టుకార్డు ఎప్పుడో పోయింది....ఇదుగో ఇక ఇప్పుడు టెలిగ్రామ్ కూడా... ఎన్వలప్ పొట్టిదల్లా ..పొడుగయింది....
      ఆధునిక విజ్ఞానం అవుపోశన పట్టడంలో ..కొన్నిటికి తిలోదకాలు...తప్పవుమరి... 
     విజ్ఞానం అంటే గుర్తొచ్చింది...         ........
       అంగారక గ్రహంలోకే గృహప్రవేశం చేసేందుకు , తండోపతండాలుగా  సిధ్దమయ్యారుట...   మానవ మేధస్సు ..ఎన్ని అధ్బుతాలనైనా సృష్ఠించగలదు..బ్రహ్మసృష్టిని ,విశ్వామిత్రసృష్టిని మించిన సృష్టిని మానవుడు రాబోయే తరాలలో నిర్మిస్తాడని ఈ మధ్యనే ఓ బుక్ లో చదివాను..
      పెరుగుట విరుగుటకొరకే  అన్న సామెతలా ..విజ్ఞానం పెరుగుతున్నకొద్దీ...మనుషులు అజ్ఞానులవుతున్నారేమో...
                  విలువలకే వలువలు ఊడ్చే కాలం వచ్చేనా......
                  మానవులే దానవులయ్యే తరుణం ఇదియేనా...
                 వంచనకే తలవంచిన మంచి కంచికి చేరేనా
                 కంచే చేనుని మేసే కలికాలం మనదేనా.....