Friday, May 27, 2016

వేంకటేశ్వరస్తుతి....








                                              
                    ... వేంకటేశ్వర స్తుతి.... 
                          (ఖండిక)

పిలిచిన బలికే దైవము
దలచిన సద్బక్తితోడ దైన్యత బాపున్
కలియుగ వేంకట నాధుని
తిలకించిన చాలు మనసు దివ్వెగ వెలుగున్ !!!


సప్త గిరులందు వెలసిన చక్కనయ్య
భక్త జనులను కరుణించు వకుళ తనయ
పిలిచినంతనె పలికెడి విభుడ నీవు
నతుల నిడెదను వెంకన్న నహరహమ్ము!!!


శంఖు చక్రంబు నామమున్ సన్నుతించి
యంజలింతును భక్తితో ననుదినమ్ము
వేంకటేశుని రూపమ్ము విస్మయమ్ము
లిప్త జూచిన నఘములు లుప్తమగును !!!


నిన్ను తిలకించి నగరున సన్నుతించి
పదసుమమ్ముల గొల్చితి పరమ పురుష
రిక్త హస్తంబు లివియని భక్తవరద
తలచ వలదయ్య హరి నన్ను దయను గనుమ!!!


వరద! వెంకట రమణుడ! వందనములు
సప్తగిరినిలయ !ముకుంద !శరణు శరణు
పద్మగర్భుడ! సిరిదొర ! ప్రణతి ప్రణతి
సంకట హరణ! హరి !కృష్ణ! టెంకటనము!!


    

Friday, May 13, 2016

అపురూప గీతమాలిక: ఆటగదరా శివా ఆటగద కేశవా

అపురూప గీతమాలిక: ఆటగదరా శివా ఆటగద కేశవా:               చిత్రం : మిథునం ( 2012) సంగీతం : స్వర వీణాపాణి రచన : తనికెళ్ళ భరణి గానం : కె.   జె. ఏసుదాసు ఆటగదరా శివా ఆటగద కేశవా ...

Thursday, April 28, 2016

కృష్ణం వందే జగద్గురుం....



                              కృష్ణం వందే జగద్గురుం

రావయ్యా మురళీధర
రావయ్యా నల్లనయ్య రాధాకృష్ణా
రావయ్యా వెన్నదినగ
రావయ్యా మమ్ము బ్రోవ రాగుణజాలా!!!

దేవకి నందన కృష్ణా
యోవారిజ పత్ర నేత్ర యో యవనారీ
రావేల దీన భాంధవ
గోవర్ధన ధారి నీకు కూర్నినిషాతుల్!!!

వందనము భక్తవరదుడ
వందనము మురారి శౌరి వంశీధరుడా
వందనమో మైందహనుడ
వందనము యశోద తనయ వందన మయ్యా!!!

కన్నుల కనబడవైతివి
చెన్నుగమరి చిన్నికృష్ణ చింతలు దీర్చన్
వెన్నను దాచితి నీకై
కన్నా! నను గావుమయ్య కౌస్తుభధారీ

దేవకి నందన ధీరజ ! కృష్ణా !
శ్రీవర దాయక శ్రీకర ! కృష్ణా !
గోవులు గాచిన గోపతి! కృష్ణా !
బ్రోవవె మమ్ము సుపూజితకృష్ణా!!!

వారిజ లోచన వందిత కృష్ణా!
ధారుణి గాచిన దాతవు కృష్ణా!
కోరి భజించెద గోపిక కృష్ణా !
నేరము లెంచకు నిర్మల కృష్ణా!!!


దండమయా మురళీధర
దండమయా నందబాల తాండవ కృష్ణా!
దండమయా వనజోదర
దండమయా చిన్నికృష్ణ దండము నీకున్!



Friday, April 22, 2016

కాఫీ ఖండిక..





                                                                       
                                 కాఫీ

నీరము పౌడరునకలిపి
తీరుగ ఫిల్టరునవేసి తీపిని చేర్చన్
క్షీరము జోడించ నమరు
నోరూరించుచునుమంచి నురగల కాఫీ!                                       

నురగలు గ్రక్కెడు కాపీ
సురుచిరమగు నిన్ను త్రాగు చుందుము నహమున్
హరిహరులిది చవి జూసిన
మరి వదలరు మాకు నిన్ను మధురపు కాఫీ!!!


కాఫీ త్రాగిన చాలును
సాఫీగా సాగు దినము సందియ మేలా?
హేఫీగా నతిధులకున్
కాఫీనందింతు రిండ్ల కాంతామణులే!!! 

ఎప్పుడు బడలిక గల్గిన
కప్పుడు కాఫీని త్రాగి కడు వేడుకతో
చప్పున పనులను జేయుచు
విప్పుగ నిను మెచ్చుచుంద్రు ఫిల్టరు కాఫీ!!!

కాఫీ త్రాగగ నుదయము
సాఫీగా జరుగు పనులు జర లేటైనన్
దాపురమగు తలనొప్పియె
మాపాలిట రక్ష నీవె మధురపు కాఫీ!!!

ఎప్పుడు పడితే నప్పుడు
ముప్పొద్దుల త్రాగుచుంద్రు మురియుచు కాఫీ
చెప్పక వచ్చెడు నతిధికి
కప్పుడు కాఫీ నొసగును కమ్మగ నతివల్!!!

Tuesday, April 19, 2016

క్షీరసాగరమధనం (ఖండిక)

       
                                                    శంకరాభరణంలో నేను వ్రాసిన
                                        ఖండిక                  
                                  క్షీరసాగరమధనం





మంధరగిరి కవ్వముగను
బంధముగ నాదిశేషు బట్టగ గిరి నా
నంధువుగహరికమఠమై
సింధువు మధనమ్ము జేయ చెలువము తోడన్!!!

పొందుగ సురలును దనుజులు
నందముగాకడలిచిలుక నానందముతో
బొందిన హాలాహలమున్
ముందుగ పుక్కిటనుబట్టె మృత్యుంజయుడే!!!

మ్రింగెనుగద పరమశివుడు
పొంగిన గరళమ్ముతాను పుక్కిట నిడుచున్
హంగుగ గళమున బెట్టిన
జంగమదేవర నుగనగ జయజయ మనుచున్!!!

హరిహరులను గొలిచిజనులు
మరలన్ మధనమ్ముజేయ మంధర గిరితో
సురభియు నైరావతమును
సిరియును కల్పకము శశియు చెన్నుగ వచ్చెన్!!!

ధరియించెను శశిని శివుడు
వరియించెను సిరిని శౌరి వాత్యల్యమునన్
తరలెను సురపతి వెంబడి
సురభియు నైరావతమును సొగసుగ దివికిన్!!!

వందనము నీలగళునకు
మందరగిరిధారి హరికి మధుసూదనకున్
వందనము సిరికి, శేషుకు
వందనమాచార్యులకును వందన మెపుడున్!!!