Saturday, August 17, 2019

చరవాణి (సాహితీభారతి )






నీవే ప్రాణము సర్వము
నీవే మా తోడు గాదె నిర్ద్వంద్వముగన్
నీవొక నిముషము లేనిదె
దేవుర్లాడెదము గాదె తిరు చరవాణీ!!!

నువ్వుంటే విశ్వమునన్
దవ్వులు గనరాక బోయె  ధరణిని సుమ్మీ
నవ్వుల పువ్వులు మాకై
మవ్వమ్ముగ దెచ్చినావె మాచరవాణీ!!!


మంచికి నుపయోగించిన
నంచితముగ మేలుజరుగు నందరికిలలో
వంచన జేయగ వాడిన
ముంచెదవుగ  జీవితములు భువి చరవాణీ!!!


Sunday, July 28, 2019

మిధునవనం---(చిత్రకవిత)


మిధునవనం---(చిత్రకవిత)

చిన్ననాటి ఆనందాలు
చిందించే మకరందాలు
జ్ఞాపకాల తీపిముళ్ళు
జాలువారె కన్నుల నీళ్ళు

గగనంలో గాలిపటాలు
ఇసుకలోన కట్టిన గూళ్ళు
దొంగాటలు కోతికొమ్మచ్చి
దొరికిపోతె  కొట్టిన పచ్చి

రాళ్ళాటలు చింతగింజలు
మళ్ళగట్లపై పరుగులు
తాటాకుల బొమ్మల పెళ్ళి
తాడాటను తీసిన గుంజీ

పంచుకున్న పీచుమిఠాయి
మంచికధల వెన్నెలరేయి
బాధ భయము లేనిదోయి
బాల్యమ్మే ఎంతో హాయి

బొంగరాల గింగరాలు
సంగడీలతో ఆటలు
చెంగు చెంగున గెంతులు
బెంగలేని ఆనందాలు

దసరాలో పువ్వుల బాణం
తీయని వడపప్పు బెల్లము
పల్లెలోన వదిలిన బాల్యం
పంచుకున్న తరగని మూల్యం

బాల్యంలో జ్ఞాపకాలు
మాసిపోని ఆనవాళ్ళు
కాలంలో మైలురాళ్ళు
మరలిరాని మాధుర్యాలు!!!


మిధునవనం - చిత్రం.



మిధునవనం - చిత్రం.

నీతో నేను నీలో నేను
నిలిచుంటాను కడదాకా
నాలో నేను లేనే లేను
నీలో ఉన్నా విడలేకా

ఏనాటి బంధమో
జన్మాల గంధమో
ప్రియతమా.....
నీ నవ్వె నాకు సుప్రభాతము!
నువ్వన్న చోటె స్వర్గధామము!

ఎన్ని దినములు గడిచాయో
ఎవరికి ఎరుకమ్మా
నీతో ఉన్న సమయాన
యుగమే క్షణమమ్మా
కష్టసుఖాలు కలబోసుకుని
నను నడిపెను నీ చేయి
ఇష్టసఖీ !నువు లేకుంటే
నాబ్రతుకే లేదోయి

ప్రియతమా …..
నీ మాటె నాకు మంత్రపుష్పము!
అది లేని నాడు నేనె శూన్యము!

నీ కన్నుల్లో కన్నీరేలా
నవ్వవె నువ్వు విరిబాలా
పూవే లేని తావుంటుందా?
తోడే లేని నీడుంటుందా?
ప్రియతమా ..
నేనుంటినమ్మ నీకు తోడుగా!
జోలాలి పాడనా తీయగా…..!!!

మిధునవనం చిత్రం


మిధునవనం చిత్రానికి...

ఏయే ఋతువుల కాసే వాటిని
ఆయా వేళల అమ్ముకునీ
సాగిస్తోంది జీవనయానం
సంతోషంతో ఈ అవ్వ

కొడుకులు వద్దని చెప్పిననూ
కోడలు ప్రేమగ కసిరిననూ
చక్కని వృత్తిని ఎన్నుకునే
మక్కువ మీరగ ఈ అవ్వ

కష్టపడుటలో ఆనందం
కూర్చుని తింటే రాదంటూ
శ్రమయే శక్తిని ఇచ్చుననీ
నవ్వుతు చెప్పెను ఈ అవ్వ

రెక్కల్లో బలముంటే చాలును
ఆకలి డొక్కలు నింపగ వచ్చును
అవసరమున్నా లేకున్నా
అందుకె పనిచేయును అవ్వ

అవ్వచెప్పిన జీవిత సత్యం
అందిస్తోంది తారకమంత్రం
అదిఏదంటే పనియే దైవం
శ్రమలో ఉన్నది ఆరోగ్యం!!!

మిధునవనం)(చిత్రానికి)


ద్విపదలు..(మిధునవనం)(చిత్రానికి)

కురిసేటి వానలో గూర్చుంటి నేను
మరిచేవు ప్రియతమా మాటిచ్చి నావె
                                      
ముక్కలైన మదిలోనె ముసిరె మేఘాలు
చక్కనమ్మ చెక్కిలిపై జారె నీలాలు

చిన్నారి మనసునే చిరుగాలి తడిమె
చిగురించు భావాలు చినుకులై తడిపె

నాలోని భావాలునను తడిపె చూడు
లోలోన  బిడియాలు కసిరేను నేడు

మిధునవనం- చిత్రం


మిధునవనంచిత్రానికి 
మంజరీ ద్విపద

ఆనంద పొదరిల్లు అదియేను చూడు
అందాల హరివిల్లు అరుదాయె నేడు
బంధువుల్ ముడివేసె బంధాలు నాడు
వలసదారులు బట్టె భాధ్యతల్ నేడు
అడ్డాలనాడె బిడ్డలనియంటారు
అదినేడు  ఋజువయ్యె అవనినీ తీరు
పొట్టచేతను బట్టి పుడమి వారసులు
పోవు చుండెను తల్లి మురిసి దేశాలు
ఎన్నాళ్ళకోగాని ఏగుదెంచుటకు
వీలుచిక్కదు తండ్రి మిమ్ము జూచుటకు
కలహాలు బడుచున్న కలసియుంటేను
నిలుచులే మమతలు నిన్ను వీడకను
ముక్కముక్కలు దెచ్చి మూతికందించ
రెక్కలే రావంగ రివ్వునే యెగురు
కాలు చెయ్యాడక కడగండ్లు బడుచు
పండు టాకులు చేరు పర్ణశాలలకు
ఇటువంటి చిత్రాల నింపుగా జూసి
కమనీయ కవితలుకదిపితే కాదు
ఇలలోన బంధాలు నిలిపితే చాలు
అందరూ కలిసున్న బృందావనాలు
అటువంటి వారికి అభివందనాలు!!!


జై జవాన్ - జై కిసాన్



జై జవాన్  -  జై కిసాన్  ( ఇష్టపది )


అన్నదాతయె యొకరు
అవని రక్షకుడొకరు
కష్టజీవియె యొకడు
గాళకుండొక్కడు

హలమునే చేబూని
పొలముదున్నును నొకడు
మరఫిరంగులు బట్టి
తిరుగాడు నొక్కడు

నవధాన్యరాశులను
భువికీయు నొక్కడు
తనదు ప్రాణములొడ్డి
ధరగాచు నొక్కడు

విశ్వరక్షకులైన
వీరికెవ్వరు సాటి
జోహారు కర్షకా
జోహారు సైనికా!!!