Monday, November 30, 2015

గురజాడ శతవర్ధంతి సందర్భంగా....


 
గురజాడ


            శ్రీ గురజాడ అప్పారావుగారు 1910 లో రచించిన  ఈ దేశభక్తి గేయం, నాడు  ప్రజల్లో దేశభక్తిని రగిలించి దేశాభివృద్ధికై  కార్యోన్ముఖులను జేసింది..ద్వారం వెంకట స్వామి నాయుడుగారు ఈగేయానికి స్వరాలను కూర్చారు..అప్పటికీ ,ఇప్పటికీ ఎప్పటికీ ఈ గేయం పాడుతున్నా వింటున్నా

ప్రతీ తెలుగువారి హృదయాలను తట్టిలేపి దేహాన్ని  పులకింపచేసే శక్తి యున్న ఆర్ధ్రత గలిగిన గేయమిది...అలాగే విశ్వవిఖ్యాతి నొందిన కన్యాశుల్కం...ఇంకా కన్యక..పూర్ణమ్మ..ఇవన్నీఆనాటి సామాజిక పరిస్ధితులను మన కళ్ళముందు సాక్షాత్కరింప జేస్తాయి...

          విజయనగరం..గురజాడఆడుగుజాడలు, అడుగడుగునా ఆనవాలుగా నిలుపుకున్ననగరం వారు పనిచేసిన ఎమ్ ఆర్ హైస్కూలు , ఎమ్ ఆర్ కాలేజ్ , కదం తొక్కే వారి పదాల మాధుర్యాన్ని ఆస్వాదించిన స్వగృహం... ఇవన్నీ ఈరోజు ఆ మహనీయని దలచుకుని తమ మమతను చాటుతున్నాయి..వారింటి ముందునుండి ఎప్పుడు వెళ్ళినా వారిని, వారి సాహిత్యాన్ని మననం చేసుకుంటాను ..నేననే కాదు.. విజయనగరంలోసాహిత్యాభిమానులందరూ  వారి ఇంటిని ఓ గుడిలా భావిస్తారు...ఇప్పుడు ఆ ఇంట్లో లైబ్రరీ వుంది..ఇంకా మేడమీదన ఆయన వాడే జ్ఞాపికలు (కుర్చీ ,కళ్ళజోడు) వగైరా వున్నాయి.. 

         గురజాడ అప్పారావుగారు , ఆదిభట్ల నారాయణదాసుగారు,ఘం టశాల,సుశీలమ్మ, ద్వారం నాయుడుగారు..కోడి రామ్మూర్తిగారు, చాసో..ఇంకా ఎందరో మహామహులు రచయిత్రులు కవయిత్రులు మేటికవులు నడయాడిన ఈ నేల గాలిలో కూడా సంగీత,సాహిత్యాలు లీనమై ఆహ్లాదాన్ని అందిస్తాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు.......అటువంటి విజయనగరం మా వూరు కావడం మా అదృష్టం..

చివరగా ....
              అన్నదమ్ములవలెను జాతులు
            మతములన్నియు మెలగవలెనోయ్
 
                   దేశమంటే మట్టి కాదోయ్
                   దేశమంటే మనుషులోయ్.....
  

 

అన్న గురజాడవారి మాటలు అనవరతం అందరికీ ఆదర్శం కావాలనీ.. ఆచరణలో తేవాలనీ..భావికి,  దేశం లో.. మట్టి మాత్రమే, కాక మనుషులు కూడా మిగలాలని ఆశ..ఆకాంక్ష...

         

2 comments: