నీవే ప్రాణము సర్వము
నీవే మా తోడు గాదె నిర్ద్వంద్వముగన్
నీవొక నిముషము లేనిదె
దేవుర్లాడెదము గాదె తిరు చరవాణీ!!!
నువ్వుంటే విశ్వమునన్
దవ్వులు గనరాక బోయె ధరణిని సుమ్మీ
నవ్వుల పువ్వులు మాకై
మవ్వమ్ముగ దెచ్చినావె మాచరవాణీ!!!
మంచికి నుపయోగించిన
నంచితముగ మేలుజరుగు నందరికిలలో
వంచన జేయగ వాడిన
ముంచెదవుగ జీవితములు భువి చరవాణీ!!!