Friday, October 14, 2016
సిద్ధిధాత్రి
సిద్ధిధాత్రి
తొమ్మిదవనాడుముదముగ
అమ్మని సద్భక్తి తోడ నర్చన జేయన్
నెమ్మినిడి సిద్ధిధాత్రియె
నెమ్మనమున గోర్కెలన్ని నెరవేర్చునిలన్!!!
స్థిరముగ కమలమునందున
కరముల శంఖమ్ము మరియు కమలమ్ములతో
శరణను వారిని నిరతము
కరుణించెడు సిద్ధిధాత్రి కైచాపులివే!!!
మహాగౌరి
మహాగౌరి
అష్టమ దినమున భూరిన్
స్పష్టంబగు ధవళవర్ణ భాసము తోడ
న్నిష్టముగ మహా గౌరియె
శిష్టుల రక్షించి భువికి సిరులనొసంగున్!!!
Friday, October 7, 2016
కాళరాత్రి...
కాళరాత్రి
ఏడవ దినమున శ్రద్ధగ
వేడుకతో కాళరాత్రి పేరు జపింపన్
పీడలను జేరనీయక
పోడిమితో నరయు సతికి మ్రొక్కదనెపుడున్!!!
కాత్యాయనిీ దేవి..
కాత్యాయని
కాత్యాయన ముని పుత్రిక
కాత్యాయని దేవి గొలువ కమనీయముగన్
సత్యమగు తల్లి కరుణను
నిత్యము మరి బొందగలరు నిజభక్తులిలన్!!!
ఆరవ దినమున భక్తిగ
గారవముగ బూజసేయ కాత్యాయనినే
కోరిన గోర్కెలు దీర్చుచు
ధారుణిలో జయము లొసగు తల్లికి ప్రణతుల్!!!
Wednesday, October 5, 2016
స్కందమాత
స్కందమాత
స్కందుని యొడిలోనిడుకొని
యిందీవరములు మెరియగ నిరుచేతులలో
నందముగ నభయమిడుచు
న్నందరకును స్కందమాత నాశిసు లీయున్!!!
పంచమదినమున విధిగా
మంచిగ జనులంత స్కందమాతను గొలువన్
త్రుంచుచు బాధల నిలలో
పెంచును గద సంతసమ్ము విజయములిడుచున్!!!
Tuesday, October 4, 2016
కూష్మాండ
కూష్మాండ
ఇష్టంబుగ కూష్మాండయె
సృష్టిని సృజియింపజేసె చిరుహాసముతో
అష్టభుజాదేవి గొలువ
కష్టములను దీర్చి గాచు కలకాలంబున్!!!
నవరాత్రులలో నాల్గవ
దివమున బూజించి ధూప
దీపమ్ములతో
శివ సతియౌ కూష్మాండను
స్తవమును జేయంగతల్లి సౌఖ్యము లీయున్!!!
Monday, October 3, 2016
చంద్రఘంట
చంద్రఘంట
శిరమునమరి నెలవంకయు
కరముల జపమాల ఘంట ఖడ్గము దమ్మిన్
బరిసయు శూలమ్ములతో
సురుచిరమగు చంద్రఘంట జోహారులివే!!!
దేవీ-నవరాత్రులు
దేవీనవరాత్రులు
శైలపుత్రి
నవరాత్రులలో ముందుగ
శివశంకరి శైలపుత్రి క్షేమను భక్తిన్
ప్రవరంబుగ బూజింపగ
శివముల నిడి గాచు మనల శివవల్లభయే!!!
బ్రహ్మచారిణి
పరమేశుని వరియించగ
కరమున జపమాలదాల్చి కడునీమముతో
స్థిరముగ దపమొనరించెడు
కరుణామయి బ్రహ్మవిద్య కైమోడ్పులివే!!!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)