|
దుర్గామాత |
మత్తకోకిల...
అండ పిండము లందు నీవెగ నాదిశక్తి మహేశ్వరీ !
చండ చండిక భద్రకాళిక చర్చ ఛాయ సనాతనీ !
హిండి చండి భవాని మాతృక యీశ్వరీ సురసుందరీ!
నిండు భక్తిగ నిన్ను గొల్చితి నేరమెంచకు శారదా!!!
|
సిద్ధిధాత్రి |
మత్తకోకిల.....
సిద్ధి ధాత్రి! శివాని శంకరి సింహవాహిని చండికా!
సిద్ధయోగుని యర్దభాగిని శ్రీగిరీ భ్రమరాంబికా !
బుద్ధి విద్యల నిచ్చి గావుమ భూతమాత చతుర్భుజా!
వృద్ధి చెందగ సర్వ సిద్ధులు వేడ్కతోకరుణించుమా!!!
|
మహాగౌరి
|
మత్తకోకిల...
చల్లనైనది గౌరి రూపము చాంద్రి మల్లెల నొప్పుచు
న్నెల్ల లోకము లేలు శాంభవి యిందుమౌళి సభర్తృకా
పల్లవించుచు నందివాహని భాసమాన చతుర్భుజా
తల్లి మమ్ముల బ్రోవు నిత్యము దాక్షి దుగ్గి మహేశ్వరీ!!!
|
కాళరాత్రి |
మత్తకోకిల.....
కాళరాత్రి! కిరాతి కర్వరి కాంతి రూపిణి వందనమ్
కాల దేహిని దైత్యనాశిని కప్పుటైదువ వందనమ్
నీలకేశిని భక్తపాలిని నీలలోహిత వందనమ్
జ్వాలలోచని గార్ధవాహన ఛాయ చండిక వందనమ్!!!
|
కాత్యాయని |
మత్తకోకిల...
కామితమ్ములు దీర్చు తల్లివి కల్పవల్లివి కౌశికీ !
క్షేమ దాయిని శోకనాశిని సింహవాహిని షడ్భుజా!
నీమ నిష్ఠల నిన్ను గొల్చిన నిండు సౌఖ్యము సర్వదా!
హైమ శాక్రి కృపాపయోనిధి యంజలింతును భక్తితో!!!
|
స్కందమాత |
మత్తకోకిల....
స్కందమాత! శివాని !పాటల! సర్వమంగళ శైలజా!
మందహాసిని బిందురూపిణి మంజు భాషిణి మాలినీ !
స్కందు నీయొడి గారవించుచు చల్లనౌక నుజూపుతో!
వందనమ్ముల నందుకోశివ శంకరీ కరుణించుమా !!!
|
కూష్మాండ |
మత్తకోకిల.....
చిన్ని నవ్వును రువ్వి సృష్టిని చిత్తరంబుగ దీర్చినా!
అన్నపూర్ణవు నాదిశక్తివి సింహయానవు నంబికా !
సున్నితంబుగ మమ్ము గావుమ సూర్యమండలవాసినీ!
నిన్ను గొల్చెద నన్ని వేళల నీలలోహిత వందనమ్!!!
|
చంద్రఘంట |
మత్తకోకిల...
చంద్రఘంట భవాని మాలిని సర్వలోకవశంకరీ !
చంద్ర బింబపు మోము గల్గిన చారులోచని భ్రామరీ!
చంద్ర చూడుని ధర్మభాగిని సర్వపాప వినాశినీ!
చంద్రశేఖరి స్వర్ణరూపిణి సన్నుతించెద భక్తితో!!!
|
బ్రహ్మచారిణి
|
మత్తకోకిల...
భక్తితో నిను గొల్చు వారికి బ్రహ్మచారిణి రూపునన్
యుక్తి నిచ్చెడి బ్రహ్మవిద్యవు యోగమాయవు పావనీ!
శక్తి పాణికి కన్నతల్లివి శాంకరీ నగ నందినీ!
ముక్తి నిచ్చెడి జ్యోతి రూపిణి మ్రొక్కు చుంటిని నేసదా!!!
|
శైలపుత్రి
|
దేవీ నవరాత్రులు
మత్తకోకిల.....
వందనమ్ములు శైలపుత్రికి వందనమ్ములు ముందుగన్
విందుగా చలికొండచూలికి విశ్వమాతకు వందనమ్
సుందరంబగు శూలధారిణి శూలి పత్నికి వందనమ్
వందనమ్ములు బాలచంద్రకు వందనమ్ములు భక్తితో!!!